ఈవీల చార్జింగ్‌కు ఒకే వాలెట్!?
ABN , Publish Date - May 04 , 2026 | 03:46 AM
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)ల వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఈవీల పట్ల మక్కువ చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఈవీలు కొనేవారి సంఖ్య పెరుగుతోంది.
అందులో డబ్బు జమ చేసుకుంటే ఏ కేంద్రంలోనైనా చార్జ్ చేసుకోవచ్చు!
ఫాస్టాగ్ తరహాలో అందుబాటులోకి తెచ్చే యోచనలో రవాణా శాఖ
(సెంట్రల్ డెస్క్)
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)ల వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రజలు ఈవీల పట్ల మక్కువ చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ఈవీలు కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈవీలకు చార్జింగ్ విషయంలో మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. చార్జింగ్ కేంద్రాల్లో వేర్వేరు చెల్లింపు వ్యవస్థలు ఉండడంతో వాహనదారులకు తలనొప్పిగా మారుతోంది. ఏకరూప ‘పేమెంట్ వాలెట్’ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. వివిధ కంపెనీల చార్జింగ్ స్టేషన్లు వేర్వేరు యాప్‌లు, వాలెట్లను ఉపయోగించడం వల్ల వినియోగదారులకు ఇబ్బందికరంగా ఉంటోంది. ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని, వాటిలో డబ్బులు జమ చేయాల్సి వస్తోంది. మరోవైపు ఒక నగరంలోనే వేర్వేరు స్టేషన్లు వేర్వేరు విధానాల్లో పనిచేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో సరైన యాప్ లేక చార్జింగ్ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారికైతే ఇది మరీ ఇబ్బందికరంగా మారుతోంది. ఈవీల విస్తరణకు ఇది ప్రధాన అవరోధంగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చార్జింగ్ స్టేషన్లకు అనుసంధానమయ్యే యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకురావాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యపై రాష్ట్ర రవాణా శాఖ దృష్టి సారించింది. ఫాస్టాగ్ తరహాలో ఈవీల చార్జింగ్‌కు ఒకే వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఆ వాలెట్‌లో డబ్బు జమ చేసుకుంటే ఏ కంపెనీకి చెంది న చార్జింగ్ కేంద్రంలో అయినా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చు. ఈ అంశంపై వాహన తయారీ సంస్థల ప్రతినిధులతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఒకే వాలెట్ విధానంపై ప్రతిపాదనలు అందించారు. ఆయా సంస్థలు ఆమోదం తెలిపిన వెంటనే ఒకే వాలెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు రవాణాశాఖ వర్గాలు తెలిపాయి.
చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలివే..
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానం లో పెద్ద ఎత్తున చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి.
హైవేల వెంట ప్రతి 40-50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ కేంద్రం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి.
అన్ని చార్జింగ్ స్టేషన్లకు అనుసంధానమయ్యే ‘యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్’ను ప్రవేశపెట్టడం అత్యవసరం.
స్థానిక సంస్థలు, డిస్కంలు కలిసి అపార్ట్‌మెంట్లు, కార్యాలయాలు, పార్కింగ్ స్థలాల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును ప్రోత్సహించాలి.