సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్
ABN , Publish Date - Mar 01 , 2026 | 03:39 AM
ఒక ఫోన్‌లో సిమ్ వేసి వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వాడుకుంటూ, మళ్లీ అదే సిమ్ నంబర్‌తో మరో ఫోన్‌లో మళ్లీ వాట్సా్‌ప్ ను డౌన్‌లోడ్ చేసుకుని, రెండు ఫోన్లలో కూడా వాట్సా్‌ప్‌ను వాడుకుందామంటే ఇకపై కుదరదు.
ఇతర మెసేజింగ్ యాప్‌లకు కూడా సిమ్ బైండింగ్
ఫోన్ నుంచి సిమ్ తీస్తే ఆ యాప్‌లు బంద్
నేటి నుంచి కొత్త నిబంధన అమలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఒక ఫోన్‌లో సిమ్ వేసి వాట్సాప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని వాడుకుంటూ, మళ్లీ అదే సిమ్ నంబర్‌తో మరో ఫోన్‌లో మళ్లీ వాట్సా్‌పను డౌన్‌లోడ్ చేసుకుని, రెండు ఫోన్లలో కూడా వాట్సా్‌పను వాడుకుందామంటే ఇకపై కుదరదు. ఏ ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ ఉంటుందో ఆ ఫోన్‌లో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. ఒక్క వాట్సా్‌పకే కాదు.. టెలీగ్రాం, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్‌లు అన్నింటికి కూడా ఈ సిమ్ బైండింగ్ నిబంధన మార్చి 1 నుంచి అమలవుతుంది. ఇప్పటికే ఈ విషయంలో గత నవంబరు 28న డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను అమలు చేయడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫాంలకు 90 రోజులు గడువు ఇచ్చింది. ఆ గడువు ఫిబ్రవరి 28తో పూర్తయింది. దీంతో కొత్త నిబంధనలను ఆదివారం నుంచి మెసేజింగ్ యాప్స్ కచ్చితంగా పాటించాలి. ఆ నిబంధనల ప్రకారం, సిమ్ లేకుండా మొబైల్‌లో వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ వాడుతున్న వారికి వాటి సేవలు నిలిచిపోతాయి. ఫోన్ నుంచి సిమ్ తీసినా, స్వాపింగ్ చేసినా, డీయాక్టివేట్ చేసినా ఆ యాప్‌లు ఆగిపోతాయి. మళ్లీ ఒరిజినల్ సిమ్ వేసి ఆథంటికేషన్ చేసినప్పుడే అవి తిరిగి పనిచేస్తాయి.
అలాగే డెస్క్ టాప్ కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పల్లో వాట్సాప్ వెబ్, టెలీగ్రామ్ వెబ్ వంటివి కూడా ప్రతి 6 గంటలకు ఓసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అయిపోతాయి. మళ్లీ యాక్టివ్ అవ్వాలంటే సిమ్ ఉన్న ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆథంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సైబర్ నేరాలను, సిమ్ స్వాపింగ్ స్కామ్‌లను, వ్యక్తుల గుర్తింపు తెలియకుండా చేసే సైబర్ దాడులను నియంత్రించడానికి ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు కేంద్రం చెప్పింది. సిమ్ బైండింగ్ ద్వారా నేరగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. డిజిటల్ భద్రతకు ఉపయోగపడే ఈ నిబంధన గడువును పొడిగించే అవకాశం ఎంతమాత్రం లేదని సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. బహుళ పరికరాలను వినియోగించే వారికి, తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఈ నిబంధన ఇబ్బందికరంగా ఉంటుందని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఆందోళన వ్యక్తం చేసినా వినియోగదారుల భద్రత ముఖ్యమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.