గతీ, శ్రుతీమారుతుంది!
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:48 AM
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పడినట్లే. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా..
చట్టసభల్లో మహిళలకు 33 శాతంతో గణనీయమైన మార్పులు
లోక్‌సభలో ప్రస్తుతం మహిళా ఎంపీలు 74 మందే
కోటా అమలైతే 180కి పెరగనున్న సంఖ్య..
నియోజకవర్గాల పునర్విభజనతో 273కి
అసెంబ్లీల్లోనూ గణనీయంగా అతివల ప్రాతినిధ్యం
స్త్రీ పురుష సమానత్వం దిశగా అడుగులు
మహిళల తరఫున పురుషులే అజమాయిషీ?
ఓబీసీ కోటా లేకపోవటంతో.. సామాజిక న్యాయం ఎండమావేనా? సవాళ్లు, సందేహాలు
(సెంట్రల్ డెస్క్)
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. దేశ రాజకీయాల్లో స్త్రీ పురుష సమానత్వం దిశగా మరో కీలక ముందడుగు పడినట్లే. ఇప్పటికే స్థానిక సంస్థల్లో అమలవుతున్న కోటా కారణంగా.. గ్రామాలు, పట్టణాల్లో అతివల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది కానీ.. కొన్ని దశాబ్దాలుగా అది అక్కడికే పరిమితమైంది. రాజకీయాధికారానికి అసలు సిసలు కేంద్రబిందువైన అసెంబ్లీలకు, పార్లమెంటుకు విస్తరించలేదు. తాజాగా కేంద్ర సర్కారు తీసుకురానున్న బిల్లుతో ఈ లక్ష్యం చేరుకోవటానికి మహిళలకు ఇక ఎంతో కాలం పట్టదు. ప్రస్తుతం లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలున్నారు. లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్య 534లో ఇది కేవలం 13.8 శాతం. జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలు.. దేశాన్ని శాసించే లోక్‌సభలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉండటం ఎంతమాత్రం సరైనది కాదని పలు సర్వేలు, అధ్యయనాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో, ఆలస్యంగానైనా.. ఈ దిశగా మంచి మార్పు మొదలైందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 33 శాతం రిజర్వేషన్ అమలులోకి వస్తే.. ఇప్పుడున్న సీట్ల పరంగా లోక్‌సభలో మహిళల సంఖ్య ఒకేసారి 180కి పెరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్న తరుణంలో లోక్‌సభలో సీట్ల సంఖ్య 816కి పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మహిళల వాటా ఏకంగా 273కి చేరుకుంటుంది. దీనికి తోడు.. జనరల్, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో పురుషులతో తలపడి గెలిచే మహిళలతో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.
విస్తృతం కానున్న అవకాశాలు
ప్రస్తుతం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. అరకొర మినహాయింపులున్నా సాధారణంగా కనిపించే రాజకీయ చిత్రమిది. మహిళలకు మూడోవంతు ప్రాతినిధ్యం అమలైతే.. ఈ పరిస్థితి మారే అవకాశాలున్నాయి. అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు చెందిన వారు కూడా పోటీకి ముందుకొస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి రుజువు. రిజర్వేషన్ కారణంగా పట్టణాలు, గ్రామాల్లో.. ఎంతోమంది సాధారణ నేపథ్యం ఉన్న మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించి తమదైన ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది మహిళలు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికిదే ఒక విజయంగా చెప్పవచ్చు.
పెరగనున్న నిర్ణయాధికారం
స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇంట్లో స్త్రీల నిర్ణయాధికారం పెరగటంతోపాటు ఉద్యోగాల్లో, స్వయం ఉపాధిలో, మొత్తంగా ప్రజాజీవనంలో వారి ప్రభావం, సంఖ్య పెరిగిందని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అంతేకాదు, మహిళల పాలనలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో (అన్నింటిలో కాకపోయినా.. గణనీయమైన సంఖ్యలో) తాగునీరు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, ఆస్పత్రి, పౌష్టికాహారం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని, మహిళలపై నేరాలు తగ్గాయని వెల్లడైంది. రాష్ట్రాన్ని, యావత్ దేశాన్ని ప్రభావితం చేసే చట్టసభల్లో అతివల సంఖ్య పెరిగితే.. చట్టాల రూపకల్పనలోనూ ఈ మార్పులు ప్రతిబింబిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
యువతరానికి స్ఫూర్తి
పార్లమెంటు, అసెంబ్లీ వంటి అత్యున్నత చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరగటం సమాజంలోని బాలికలు, యువతులపై మంచి ప్రభావం చూపుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్లటానికి దోహదపడుతుంది. తాము కూడా రాజకీయ రంగంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలని, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకునే అవకాశాలు పెరుగుతాయి. ‘రాజకీయాలు పురుషుల కార్యక్షేత్రం’ అన్న అభిప్రాయం క్రమేణా తొలగిపోయి, స్త్రీ పురుష సమానత్వం దిశగా బలమైన అడుగులు పడతాయి.
రాజకీయపార్టీల్లో మార్పులు
ప్రస్తుతం పలు రాజకీయపార్టీల్లో మహిళా నేతలు ఉన్నప్పటికీ.. వారిలో నిర్ణయాధికారం ఉన్న వారు తక్కువే. మహిళా విభాగానికి ప్రాతినిధ్యం వహించటమో, ఒకట్రెండు ఎమ్మెల్యే పదవుల్లో ఉండటమో తప్ప పార్టీ నిర్ణయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న వారు ఎక్కువగా కనిపించరు. మహిళా కోటా అమలైతే.. ఈ పరిస్థితి మారవచ్చు. పార్టీలు ఎక్కువ సంఖ్యలో మహిళల్ని నాయకత్వ స్థానాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
సవాళ్లు
స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ.. పలు చోట్ల.. వారి తరఫున వారి భర్తలే అజమాయిషీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాగే లేకపోయినా.. ఇదొక తీవ్రమైన సమస్యగానే కొనసాగుతోంది. చట్టసభల్లో రిజర్వేషన్ అమలైన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా అన్న సందేహాలు ఉన్నాయి. అలాగే, దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు మహిళా కోటాలో ఉప కోటా కేటాయించకుండా మహిళా రిజర్వేషన్లు కల్పిస్తే.. ఇప్పటికే ఉన్న అగ్రకుల రాజకీయాల్ని మరింత సుస్థిరం చేసినట్లవుతుందన్న విమర్శలున్నాయి. మహిళలకు కేటాయించిన సీట్లలో (ఎస్సీ, ఎస్టీ స్థానాలను మినహాయించి) ధనబలం అధికంగా ఉన్న అగ్రకులాలకు చెందిన మహిళలే ఎన్నికవుతారని, వారితో బీసీ మహిళలు తలపడలేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ లింగ సమానత్వం వంటి సానుకూల మార్పులకు నాంది పలికినా.. సామాజిక న్యాయం ఎండమావే అవుతుందన్న అంచనాలున్నాయి.