Share News

పంజాబ్‌లో ఒక్కటైన పాత మిత్రులు

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:15 AM

పంజాబ్‌లో పాత మిత్రులు మళ్లీ కలిశారు. చాలా ఏళ్లు ఎన్డీయేలో కొనసాగి, ఆరేళ్ల క్రితం బయటికి వచ్చిన శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తిరిగి ఎన్డీయే గూటికి చేరింది.

పంజాబ్‌లో ఒక్కటైన పాత మిత్రులు

  • తిరిగి ఎన్డీయేలోకి అకాలీదళ్‌

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ

  • అకాలీదళ్‌ పార్టీకే సీఎం పదవి: అమిత్‌ షా

న్యూఢిల్లీ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పంజాబ్‌లో పాత మిత్రులు మళ్లీ కలిశారు. చాలా ఏళ్లు ఎన్డీయేలో కొనసాగి, ఆరేళ్ల క్రితం బయటికి వచ్చిన శిరోమణి అకాలీదళ్‌ పార్టీ తిరిగి ఎన్డీయే గూటికి చేరింది. అకాలీదళ్‌ పార్టీ కేంద్రంలో అధికార ఎన్డీయేలో చేరడంతో పాటు, త్వరలో జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్టు అకాలీదళ్‌, బీజేపీ మంగళవారం ప్రకటించాయి. పంజాబ్‌లో బీజేపీ, అకాలీదళ్‌ పొత్తును ‘జాతీయ, భావోద్వేగ బంధం’గా అభివర్ణించాయి. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు నితీన్‌ నబీన్‌, అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఈ వివరాలు వెల్లడించారు. అకాలీదళ్‌ తిరిగి ఎన్డీయేలోకి చేరడాన్ని అమిత్‌ షా స్వాగతించారు. పంజాబ్‌ కూటమిలో అకాలీదళ్‌ పెద్దన్న (బడే భాయ్‌) పాత్ర పోషిస్తుందని, సీఎం పదవి సైతం ఆ పార్టీకే ఉంటుందని చెప్పారు. ఈ పొత్తు కేవలం రాజకీయ అవసరాల కోసం కాకుండా.. పంజాబ్‌లో హిందూ, సిక్కు సోదర భావానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. తమ బంధం రాజకీయమైనదే కాదని, ఇది పంజాబ్‌ ప్రయోజనాలకు కీలకమని సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ పేర్కొన్నారు. పంజాబ్‌లో డ్రగ్స్‌ సమస్యను 2029 డిసెంబరు 31 నాటికి పూర్తిగా నిర్మూలించడమే తమ మొదటి లక్ష్యమని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 40 సీట్లలో పోటీచేసే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ రాజకీయాల్లో బీజేపీ, అకాలీదళ్‌ సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా కొనసాగాయి. ఆరేళ్ల క్రితం కేంద్ర వ్యవసాయ చట్టాలపై తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఎన్డీయే నుంచి అకాలీదళ్‌ బయటికి వచ్చింది. తర్వాత జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్‌, బీజేపీ ప్రభావం చూపలేకపోయాయి.

Updated Date - Nov 25 , 2026 | 03:17 AM