Share News

తమిళనాట శశికళ కొత్త పార్టీ

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:38 AM

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు...

తమిళనాట శశికళ కొత్త పార్టీ

చెన్నై, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది. జయలలిత సన్నిహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ మంగళవారం కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. జయలలిత 78వ జయంతిని పురస్కరించుకుని రామనాథపురంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆమె.. త్వరలోనే పార్టీ పేరును వెల్లడిస్తానని తెలిపారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల పతాకంపై దివంగత సీఎంలు అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత చిత్రాలున్నాయి. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ మాజీ సీఎం పళనిస్వామి(ఈపీఎ్‌స)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ‘‘మేం తొందరపడి ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎంచుకున్నాం. అప్పటికి ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు. ఆయన్ను నేను సీఎం కుర్చీలో కూర్చోపెడితే, నన్ను పార్టీ నుంచి తొలగిస్తూ తీర్మానం చేయించాడు’’ అని శశికళ పరోక్షంగా ఈపీఎ్‌సపై నిప్పులు చెరిగారు. ‘‘నేను జైల్లో ఉన్నప్పుడు నా భర్త చనిపోతే అధికారులు 15 రోజులు పెరోల్‌ మంజూరు చేశారు. అయితే నాకు 5 రోజుల కంటే ఎక్కువ పెరోల్‌ ఇవ్వకూడదని ఉత్తర్వులు తెప్పించారు. నేను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నాకే వెన్నుపోటు పొడిచాడు’’ అంటూ శశికళ భావోద్వేగానికి గురయ్యారు.

Updated Date - Feb 25 , 2026 | 12:38 AM