విపక్షాల ఆందోళనల పట్ల ఢిల్లీ పోలీస్ తీరు భేష్
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:21 AM
కాంగ్రెస్ వైఖరికి భిన్నమైన స్వరం వినిపించే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ‘జంతర్మంతర్’ ఆందోళనల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబరు 13 : కాంగ్రెస్ వైఖరికి భిన్నమైన స్వరం వినిపించే ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ ‘జంతర్మంతర్’ ఆందోళనల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ సోమవారం సుప్రీంకోర్టు వరకు కాంగ్రెస్ నాయకత్వం తీసిన భారీ ర్యాలీ విషయంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం పూర్తి పరిపక్వతతో వ్యవహరించిందంటూ శశిథరూర్ కొనియాడారు. ‘జంతర్ మంతర్’ ఆందోళనల విషయంలో గతంలో చేసినట్టు, కాంగ్రెస్ ప్రదర్శన మీదకు పోలీసులను ప్రయోగించకుండా కేంద్ర ప్రభుత్వం మంచి పని చేసిందన్నారు. ‘‘సర్కు వ్యతిరేకంగా ఢిల్లీలో తీసిన ర్యాలీకి గొప్ప మద్దతు లభించిందని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. అది నిజం. కాంగ్రెస్ మద్దతుదారులతోపాటు సామన్య ప్రజలు కూడా పెద్దఎత్తున ఆ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రదర్శన ఆసాంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అదే సమయంలో అంతమంది రోడ్ల మీదకు వచ్చినప్పుడు పోలీసులు అడ్డగించి, లాఠీలకు పని చెబుతారేమోననే భయాందోళనలు కూడా మరోవైపు నెలకొన్నాయి. కాక్రోచ్లు, ఇతరల పట్ల శనివారం, ఆదివారం పోలీసుల అదే పని చేశారు. అయితే, దానికి భిన్నంగా పోలీసులు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడంతో ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది.’’ అని థరూర్ తెలిపారు.