కాంగ్రెస్‌కు శశి థరూర్ దూరం!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:20 AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆపార్టీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్టీ కీలక సమావేశానికి డుమ్మా
రాహుల్ పరాభవించారని అలక
న్యూఢిల్లీ, జనవరి 23: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేరళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆపార్టీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఏఐసీసీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో నిర్వహించిన ముఖ్య సమావేశానికి ఆయన డుమ్మాకొట్టారు. అయితే, కొజికోడ్‌లో జరిగే ‘కేరళ సాహిత్య ఉత్సవానికి’ హాజరుకావాల్సి ఉన్నందునే థరూర్ రాలేక పోయారని ఎంపీ కార్యాలయం తెలిపింది. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనను అవమానించారని శశి థరూర్ భావిస్తున్నారు. ఈ నెల 19న తన సొంత నియోజకవర్గం తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ‘మహా పంచాయతీ’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది. దీనిలో పాల్గొన్న రాహుల్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వేదికపై శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఆయనను కనీసం పలకరించకపోవడం, ఇతర నేతల పేర్లను ప్రస్తావించి.. ఆయనను విస్మరించడంతో శశి అలకబూనారని తెలుస్తోంది. వాస్తవానికి థరూర్ కూడా ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ లైన్‌కు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. ఎన్నోసార్లు మోదీని పొగిడారు. ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్ కాంగ్రెస్ పార్టీని వదిలేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. త్వరలోనే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చర్చకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆయనంతట ఆయన పార్టీని వదిలేయకుండా.. పార్టీనే ఆయనను బయటకు పంపించేలా వ్యవహరిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని చెబుతున్నారు.