పార్టీతో సమస్యలు వాస్తవమే: శశి థరూర్
ABN , Publish Date - Jan 25 , 2026 | 02:40 AM
పార్టీతో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లానని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు.
కోజికోడ్, జనవరి 24: పార్టీతో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లానని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా తానెప్పుడూ గీత దాటలేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్గత విబేధాలపై మాట్లాడవలసింది మీడియాతో కాదని, పార్టీతోనేనని ఆయన చెప్పారు. తాను 17 ఏళ్లుగా కాంగ్రె్‌సలో ఉన్నానని, తన సమస్యలన్నింటికీ పార్టీ వేదికల్లోనే పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నట్లు థరూర్ తిరువనంతపురంలో మీడియాతో అన్నారు. ఎన్నికల వ్యూహాలపై నిర్వహించిన కీలక సమావేశానికి థరూర్ హాజరుకాకపోవడంతో ఆయన సొంత పార్టీపై అసంతృప్తితో ఉన్నారంటూ కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో సాహిత్య ఉత్సవానికి హాజరుకావాల్సి ఉన్నందునే తాను పార్టీ సమావేశానికి రాలేదని, పార్టీతో విబేధాలు లేవని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. కొచ్చిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మీకు అవమానం జరిగిందా అన్న ప్రశ్నకు నో కామెంట్ అని థరూర్ బదులిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో తన అభిప్రాయాలపై చింతించాల్సిన పనిలేదని, వాటిని వెనక్కి తీసుకోవడం లేదని శశిథరూర్ స్పష్టం చేశారు.