Share News

Sabarimala Temple Chief Priest: బంగారం చోరీ కేసులో..శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్టు

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:22 AM

శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌ ఆ ఆలయ ప్రధాన పూజారి(తంత్రి) కందరారు రాజీవరును శుక్రవారం అరెస్టు చేసింది.

Sabarimala Temple Chief Priest: బంగారం చోరీ కేసులో..శబరిమల ఆలయ ప్రధాన పూజారి అరెస్టు

తిరువనంతపురం, న్యూఢిల్లీ, జనవరి 9: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్‌ ఆ ఆలయ ప్రధాన పూజారి(తంత్రి) కందరారు రాజీవరును శుక్రవారం అరెస్టు చేసింది. తెల్లవారుజామున ఆయన్ను ప్రశ్నించిన సిట్‌ అధికారులు అనంతరం మధ్యాహ్నం తమ కార్యాలయానికి తరలించి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టి, ట్రావెంకూర్‌ దేవస్వం బోర్డ్‌ అధ్యక్షుడు పద్మకుమార్‌లు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ప్రధాన పూజారిని అరె స్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉన్నికృష్ణన్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతడిని ఆలయానికి తీసుకువచ్చింది కూడా ఆయనేనని అధికారులు తెలుసుకున్నారు. శబరిమల ఆలయ ద్వారపాలకుల విగ్రహాల బంగారు తొడుగులకు, శ్రీకోవిల్‌ ద్వారం బంగారు తొడుగులకు మళ్లీ బంగారం తాపడం చేయాలని సలహా ఇచ్చింది కూడా ప్రధాన పూజారేనని సిట్‌ విచారణలో తేలింది. ట్రావెంకూర్‌ దేవస్థానం బోర్డు ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు తాపడం చేయించేందుకు అనుమతి కోరగా.. ప్రధాన పూజారే మంజూరు చేసినట్లు సిట్‌ అధికారులు చెప్పారు. కాగా ఈ కేసులో సిట్‌ అరెస్టు చేసిన11వ వ్యక్తి రాజీవరు. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బంగారం చోరీపై శుక్రవారం పలు సెక్షన్ల కింద మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. తగు సాక్ష్యాధారాలను సేకరించాక ఈ కేసులో అరెస్టయిన వారిని త్వరలో ఈడీ ప్రశ్నించనుంది. బంగారం తాపడం వ్యవహారానికి సంబంధించిన సంప్రదింపులు మొదలు విగ్రహాలను ఉన్నికృష్ణన్‌కు అప్పగించే వరకు తొలి నుంచి దేవస్థానం అధికారులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని, పర్యవేక్షణ వైఫల్యం కూడా ఉందని సిట్‌ కేరళ హైకోర్టుకు తెలియజేసింది. ఉన్నికృష్ణన్‌, ఈ కేసులోని ఇతర నిందితులు.. చెన్నైకి చెందిన గోవర్ధన్‌, స్మార్ట్‌ క్రియేషన్స్‌ సీఈవో పంకజ్‌ భండారీలతో కలిసి దేవస్థానంలో ఉన్న బంగారం పూత పూసిన అన్ని రాగి రేకుల నుంచి బంగారం కాజేసేందుకు నేరపూరిత కుట్ర పన్నినట్లు సిట్‌ తన స్టేట్‌మెంట్లో పేర్కొంది. నిందితులందరూ కలిసే ఈ కుట్రకు పాల్పడినట్లు తెలిపింది.

Updated Date - Jan 10 , 2026 | 04:22 AM