‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీలో ప్రదర్శనలు.. పలువురి అరెస్టు
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:20 AM
‘సర్’కు వ్యతిరేకంగా శుక్రవారం ప్రదర్శన చేపట్టిన పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
న్యూఢిల్లీ, అక్టోబరు 23 : ‘సర్’కు వ్యతిరేకంగా శుక్రవారం ప్రదర్శన చేపట్టిన పలువురిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భారీగా ఓటర్లను తొలగించారని ఆరోపిస్తూ వీరు సెంట్రల్ ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయానికి ప్రదర్శన చేపట్టారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈసీ రాజీనామా చేయాలని... ఓట్ చోరీని సహించేది లేదని... సర్‌ను నిలిపివేయాలని నినాదాలు చేశారు. ఢిల్లీ, హరియాణా, పశ్చిమ యూపీకి చెందిన పలువురు విద్యార్థులు, యువత, రైతులు నిర్వహించిన ఈ ప్రదర్శనలో సీపీఎం నేత బృందా కారత్, ఐద్వా, ఏఐడీఎస్‌వో కార్యకర్తలు పాల్గొన్నారు
మరోవైపు, ‘సర్’కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఆపేది లేదని కాక్రోచ్ జనతా పార్టీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. తమపై నమోదైన కేసులకు సంబంధించి ఢిల్లీలో మందిర్ మార్గ్ పోలీసుస్టేషన్ వద్ద స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరైన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. సీజేపీకి తాము కస్టోడియన్లు మాత్రమేనని, ఒకవేళ తాము జైలుకు వెళ్లినా ఉద్యమం ఆగదని అశుతోష్ రంకా అన్నారు. మరోవైపు, ప్రజాందోళనల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి దేశ రాజధానికి తీసుకొచ్చిన 273 కంపెనీల సీఏపీఎఫ్ బలగాల మోహరింపును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం హోం శాఖ ఆదేశాలు ఇచ్చింది.