ప్రపంచ ఆరోగ్యానికి అమీబా ముప్పు..!
ABN , Publish Date - May 04 , 2026 | 03:52 AM
అమీబా అనేది ఏకకణ జీవి. ఇవి నీటిలో ఉండే బ్యాక్టీరియాను ఆహారంగా తీసుకుని.. నీటి వనరులు శుభ్రంగా ఉండేందుకు దోహదపడతాయి.
ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు కారణం కావొచ్చు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, మే 3: అమీబా అనేది ఏకకణ జీవి. ఇవి నీటిలో ఉండే బ్యాక్టీరియాను ఆహారంగా తీసుకుని.. నీటి వనరులు శుభ్రంగా ఉండేందుకు దోహదపడతాయి. పర్యావరణ సమతుల్యతకు తోడ్పడతాయి. అయితే వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా స్వేచ్ఛగా జీవించే అమీబాలు ప్రపంచ ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమీబాల్లో చాలావరకు హానికరమైనవి కానప్పటికీ.. కొన్ని ప్రాంణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చని చెబుతున్నారు. వేడిని, క్రిమిసంహారకాలను తట్టుకుని జీవించగల వాటి సామర్థ్యం వల్ల వాటిని నియంత్రించడం కష్టంగా మారుతుందని అంటున్నారు. కాబట్టి మెరుగైన నిఘా, నీటి శుద్ధి అత్యవసరమని సూచిస్తున్నారు. ఇటీవల ‘బయోకాంటెమినెంట్’ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో.. ఈ చిన్న జీవులు ప్రపంచ ఆరోగ్యానికి కొత్త ప్రమాదంగా మారుతున్నాయని పరిశోధకులు వివరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కాలం చెల్లిన నీటి సరఫరా, శుద్ధి వ్యవస్థల కారణంగా అమీబాలు వేగంగా వ్యాపిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నీటిలో జీవించే అమీబాల గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయినప్పటికీ.. వీటి నియంత్రణ, మంచి నీటి వ్యవస్థల నిర్వహణపై ఎక్కువ శ్రద్ధ వహించాలని తెలిపారు.
నాగ్లేరియా ఫౌలెరితో మెదడుకు ముప్పు
అమీబాలు.. తడి నేల, మంచినీరు, మానవనిర్మిత నీటి వ్యవస్థల్లో నివసించే ఏకకణ జీవులు. ఇవి హానికరమైనవికావు. కానీ.. కొన్ని జాతులు అరుదుగా మానవులకు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. వీటిలో నాగ్లేరియా ఫౌలెరి రకం అమీబా ఒకటి. వీ టినే మెదడును తినేసే అమీబాలు అనీ పిలుస్తారు.