Share News

510కి 508 కేసుల్లో నిందితులకు బెయిల్‌!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:20 AM

ఒకటీ రెండూ కాదు.. ఆ జడ్జి ముందు విచారణకు వచ్చినవి 510 కేసులు. అవన్నీ వరకట్న మరణాల కేసుల్లో బెయిల్‌ కోసం దాఖలైన పిటిషన్లే. అవి గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో......

510కి 508 కేసుల్లో నిందితులకు బెయిల్‌!

న్యూఢిల్లీ, మార్చి 17: ఒకటీ రెండూ కాదు.. ఆ జడ్జి ముందు విచారణకు వచ్చినవి 510 కేసులు. అవన్నీ వరకట్న మరణాల కేసుల్లో బెయిల్‌ కోసం దాఖలైన పిటిషన్లే. అవి గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య కాలంలో విచారణకు రాగా.. వాటిలో 508 (99.61 శాతం) కేసుల్లో నిందితులకు ఆయన బెయిల్‌ ఇచ్చారు. అంతేకాదు.. ఆ బెయిల్‌ ఉత్తర్వుల్లో వాడిన భాష, విధించిన జరిమానా కూడా ఒకే తరహాలో ఉండడం గమనార్హం. ఇదీ ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ పంకజ్‌ భాటియా రికార్డు! ఓ వరకట్న మరణం కేసులో నిందితుడికి జస్టిస్‌ భాటియా ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడమే కాక ఆ ఉత్తర్వులు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వరకట్న మరణం వంటి సీరియస్‌ కేసులో నిందితుడికి బెయిల్‌ ఇవ్వడానికి విచక్షణాధికారం ఉపయోగించాలని ఎలా అనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, తన ముందు విచారణకు వచ్చిన 10 కేసుల్లో తప్ప మిగతా వాటిలో నిందితులకు నేరచరిత్ర లేదంటూ జస్టిస్‌ భాటియా బెయిల్‌ ఇచ్చారు. మొత్తం 510 మంది నిందితుల్లో 356 మంది ఏడాది కంటే తక్కువే కస్టడీలో ఉన్నారు. ఐదుగురైతే నెల రోజులైనా కటకటాల వెనక లేకుండానే బయటపడ్డారు.

Updated Date - Mar 18 , 2026 | 04:20 AM