రాయితీలు ఒప్పందాలు కాదు, సడలింపులే!
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:04 AM
ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీలను ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి ప్రకటించిన పన్ను రాయితీ జీవితకాలం కొనసాగే హక్కు కాదని తేల్చిచెప్పింది.
ఏ క్షణాన్నయినా ప్రభుత్వం ఉపసంహరించుకోవచ్చు
మహారాష్ట్ర పరిశ్రమల కేసులో సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 31: ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీలను ఎప్పుడైనా ఉపసంహరించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకసారి ప్రకటించిన పన్ను రాయితీ జీవితకాలం కొనసాగే హక్కు కాదని తేల్చిచెప్పింది. ఏ హక్కుతో ప్రభుత్వం ఆ రాయితీ ఇచ్చిందో అదే హక్కుతో ఉపసంహరించుకోవచ్చని మహారాష్ట్రకు సంబంధించిన కేసులో జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే పరిశ్రమలకు మహారాష్ట్ర ప్రభుత్వం 1994లో రాయితీలను ప్రకటించింది. ఆ తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా 2001లో ఉపసంహరించింది. దాంతో సొంతంగా ప్లాట్లు పెట్టుకొని తమకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్న కంపెనీలు ఇది అన్యాయమంటూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తాజాగా సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చింది. రాయితీలు ఒప్పందాలు కావని, అవి సడలింపులు మాత్రమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం మాట తప్పకూడదనే సిద్ధాంతం ఇక్కడ వర్తించదని చెప్పింది. రాయితీ ఉపసంహరణ పరిశ్రమనే తలకిందులు చేసే పరిస్థితి ఉంటే అన్యాయం అవుతుందని, అలాంటి పరిస్థితి లేనప్పుడు రాయితీ ఉపసంహరించుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ నిర్ణయాన్నయినా ఏ దశలోనైనా మార్చుకోవచ్చని చెప్పింది.