బిహార్ కొత్త సీఎం సమ్రాట్ చౌదరి!
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:08 AM
బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
నేడు ఉదయం 11 గంటలకు ప్రమాణం .. సీఎం పదవికి నితీశ్ రాజీనామా
డిప్యూటీ సీఎం పదవి తీసుకోవటానికి నితీశ్ కుమారుడు నిశాంత్ విముఖత
పాట్నా, ఏప్రిల్ 14: బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ నేతలు బీఎల్ సంతోష్, వినోద్ తావ్డే, కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అనంతరం, అసెంబ్లీ సెంట్రల్‌హాలులో ఎన్‌డీఏ శాసనసభాపక్షం భేటీ జరిగింది. బీజేపీ, జేడీయూ తదితర కూటమి పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తమ నేతగా సమ్రాట్ చౌదరి పేరును ఖరారు చేశారు. సమావేశంలో ఉన్న నితీశ్‌కుమార్ పూలదండ వేసి సమ్రాట్‌ను అభినందించారు. ఈ సమయంలో, నితీశ్‌కు సమ్రాట్ చౌదరి పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అంతకుముందు, సీఎం నితీశ్ కుమార్ క్యాబినెట్‌ను సమావేశపర్చారు. తాను రాజీనామా చేయనున్నట్లు తెలిపి.. క్యాబినెట్ రద్దుకు సిఫార్సు చేశారు. రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అతా హస్‌నైన్‌ను లోక్‌భవన్‌లో కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ.. ‘బిహార్ ప్రజల కోసం చాలా పని చేశాను. సీఎం పదవిని వీడాలని ఇటీవల నిర్ణయించుకున్నా. దీంట్లో భాగంగా గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించా. కొత్త ప్రభుత్వానికి నా సంపూర్ణ మార్గదర్శకత్వం, సహకారం ఉంటుంది’ అని తెలిపారు.
మరింత అభివృద్ధి దిశగా: సమ్రాట్
బీజేపీ, ఎన్‌డీఏ నేతగా ఎన్నికైన నేపథ్యంలో సమ్రాట్ చౌదరి.. బీజేపీ రాష్ట్ర ఇంచార్జి వినోద్ తావ్డేతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను సిద్ధమని తెలియజేశారు. కొత్త సీఎంగా ప్రమాణానికి సమ్రాట్ చౌదరిని గవర్నర్ ఆహ్వానించారు. బుధవారం ఉదయం 11 గంటలకు సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని లోక్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్రాట్ చౌదరితోపాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉందని, వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తమ్మీద, బిహార్‌లో బీజేపీ సారథ్యంలో తొలి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సమ్రాట్ చౌదరి ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గదర్శకత్వంలో బిహార్‌ను మరింత అభివృద్ధి, మెరుగైన పాలన దిశగా నడిపిస్తా’ అని పేర్కొన్నారు.
సమ్రాట్ చౌదరి లాలూజీ స్కూల్ విద్యార్థే: తేజస్వీ
నితీశ్‌కుమార్ గత వారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవుతారా? రాష్ట్ర రాజకీయాల్లో కూడా పాల్గొంటారా? అన్న చర్చ నడుస్తోంది. కాగా, ఈ పరిణామాలపై బిహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ సారథ్యంలోని ఎన్‌డీఏకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, సమ్రాట్ చౌదరిని చూసి ఓట్లు వేయలేదన్నారు. ఆయనకు ప్రజల ఆమోదం లేదని చెప్పారు. సమ్రాట్ చౌదరి గతంలో ఆర్జేడీలో కొనసాగిన సంగతిని గుర్తు చేస్తూ.. ‘ఆయన లాలూజీ స్కూల్ నుంచి వచ్చిన వాడే’నని వ్యాఖ్యానించారు. కాగా, నితీశ్‌కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం పదవిని చేపడతారని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పదవిని తీసుకోవటానికి ఇష్టపడటం లేదని, జేడీయూ బలోపేతంపైనే దృష్టి సారించారని సమాచారం.