Share News

బిహార్‌లో తొలి బీజేపీ సీఎంగా..సమ్రాట్‌ చౌదరి ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:33 AM

బిహార్‌లో తొలి బీజేపీ సీఎంగా ఆ పార్టీ నేత సమ్రాట్‌ చౌదరి(57) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బిహార్‌కు 24వ సీఎం. రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ లోక్‌ భవన్‌లో ఆయన చేత...

బిహార్‌లో తొలి బీజేపీ సీఎంగా..సమ్రాట్‌ చౌదరి ప్రమాణస్వీకారం

పట్నా, ఏప్రిల్‌ 15 : బిహార్‌లో తొలి బీజేపీ సీఎంగా ఆ పార్టీ నేత సమ్రాట్‌ చౌదరి(57) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన బిహార్‌కు 24వ సీఎం. రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ అతా హస్నైన్‌ లోక్‌ భవన్‌లో ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. జేడీయూ అధ్యక్షుడు, మాజీ సీఎం నితీశ్‌కుమార్‌తోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కేంద్రమంత్రి జేపీ నడ్డా, ఎల్‌జేపీ(ఆర్‌వీ) అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌ కూడా హాజరయ్యారు. జేడీయూ నేతలు బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌, విజయ్‌ కుమార్‌ చౌదరి ఇదే కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా ప్రధాని మోదీ సమ్రాట్‌ చౌదరికి అభినందనలు తెలియజేస్తూ... ఆయన అనుభవం, ప్రజాసేవలో అంకిత భావం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తాయని.. బిహార్‌ సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నానని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. కాగా ప్రమాణస్వీకారం చేసిన ఇద్దరు జేడీయూ నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. నితీష్‌ కుమార్‌ సీఎంగా ఉండగా ఇద్దరు బీజేపీ నేతలు సమ్రాట్‌ చౌదరి, విజయ్‌కుమార్‌లు ఉపముఖ్యమంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇద్దరు జేడీయూ నేతలు ఉపముఖ్యమంత్రులు కానున్నారు. కాగాసమ్రాట్‌ చౌదరి దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఆయన బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు మాత్రమే అయ్యింది. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను ఈ రోజు నుంచే విధి నిర్వహణలో నిమగ్నం అవుతానన్నారు. పాలనలో ప్రధాని మోదీ, బిహార్‌ మాజీ సీఎం నితీష్‌ కుమార్‌ విధానాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తానని పేర్కొన్నారు. కాగా, త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టనున్నట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ఇందులో కుల సమీకరణలకు ప్రాధాన్యం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 16 , 2026 | 03:33 AM