Share News

నాడు నితీశ్‌ను గద్దె దించుతానని శపథం చేసిన వ్యక్తే..

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:07 AM

రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. బిహార్‌ మాజీ సీఎం నితీశ్‌ కుమార్‌ విషయంలో ఆ రాష్ట్ర నూతన సీఎం సమ్రాట్‌ చౌదరి గతంలో చేసిన ఓ సవాలే ఇందుకు నిదర్శనం.

నాడు నితీశ్‌ను గద్దె దించుతానని శపథం చేసిన వ్యక్తే..

  • నేడు ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14 : రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. బిహార్‌ మాజీ సీఎం నితీశ్‌ కుమార్‌ విషయంలో ఆ రాష్ట్ర నూతన సీఎం సమ్రాట్‌ చౌదరి గతంలో చేసిన ఓ సవాలే ఇందుకు నిదర్శనం. అదేంటంటే.. నితీశ్‌ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేంత వరకు తాను ధరించిన తలపాగా తీయనని బీజేపీ నేత సమ్రాట్‌ చౌదరి 2023లో ఓ శపథం చేశారు. ఆ మేరకు కాషాయ రంగు తలపాగాను ధరించారు. అయితే, 2024లో జేడీయూ, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో సమ్రాట్‌ చౌదరి తన శపథాన్ని వీడారు. ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 2024 జూలైలో తన తలపాగాను తీసి అయోధ్యలో శ్రీరాముడికి సమర్పించారు. కూటమికి గౌరవమిస్తూ శపథాన్ని వీడుతున్నట్టు అప్పట్లో ప్రకటించారు. కానీ, నితీశ్‌ అంశంలో నాడు తలపాగా తీసి శపథాన్ని పక్కనపెట్టినప్పటికీ సమ్రాట్‌ చౌదరి చివరికి అనుకున్నది సాధించారంటూ బిహార్‌ ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. కాగా, బిహార్‌ రాజకీయాలను ప్రభావితం చేసే కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్‌ చౌదరి(57) రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందిన వారు. బిహార్‌ సీనియర్‌ రాజకీయ నేత శకుని చౌదరి కుమారుడే సమ్రాట్‌ చౌదరి. శకుని చౌదరి తారాపూర్‌ నియోజవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా.. ఆయన భార్య, సమ్రాట్‌ చౌదరి తల్లి పల్లవి 1998లో సమతా పార్టీ తరఫున ఆ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సమ్రాట్‌ చౌదరి 2017లో బీజేపీలో చేరారు. దాని కంటే ముందు ఆర్జేడీ, జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీల్లో పని చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవీ నేతృత్వంలో 1999లో ఆర్జేడీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో సమ్రాట్‌ చౌదరి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్‌ విప్‌గా ఉన్నారు. సమ్రాట్‌ బీజేపీలో చేరకముందు 2014లో 12 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొని చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2017లో బీజేపీలో చేరిన తర్వాత సమ్రాట్‌ రాజకీయ ప్రయాణం మరింత ఊపందుకొంది. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2025 ఎన్నికలల్లో బీజేపీని ముందుండి నడిపించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

Updated Date - Apr 15 , 2026 | 04:07 AM