రైతు రుణమాఫీ.. 5,000 నిరుద్యోగ భృతి
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:48 AM
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రజలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) హామీ ఇచ్చింది.
ఐదేళ్లలో యువతకు 25 లక్షల ఉద్యోగాలు.. మ్యానిఫెస్టోలో సమాజ్‌వాదీ పార్టీ హామీలు
లక్నో, నవంబరు 26: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే నిరుద్యోగ యువతకు నెలకు రూ.5,000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రజలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) హామీ ఇచ్చింది. వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. రెండు నుంచి మూడు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించింది. రైతులకు రుణమాఫీ చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి- మార్చిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆ పార్టీ గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రాణ్ పత్ర్- జన్ మన్ కా మ్యానిఫెస్టో- 2027’ పేరుతో రూపొందించిన మ్యానిఫెస్టోలో రైతులు, యువత, విద్యార్థులు, ఓబీసీలు, దళిత గిరిజనులు, మైనారిటీలు, మహిళలపై వరాల జల్లు కురిపించింది. పార్టీ సీనియర్ నేతల సమక్షంలో లక్నోలో ఎస్‌పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. త్వరలోనే మహిళల సంక్షేమంపై ప్రత్యేక మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాలవారీగా కూడా మ్యానిఫెస్టోలు ప్రకటిస్తామని చెప్పారు.
మీసం ఉన్న వారే యూపీ సీఎం: అసద్
ఉత్తరప్రదేశ్‌కు ఈసారి ముఖ్యమంత్రి మీసం ఉన్నవారే అవుతారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గడ్డం, మీసాలు లేనివారు, తలపై జుట్టు లేనివారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదన్నారు. తద్వారా.. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌కు ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేవని పరోక్షంగా పేర్కొన్నారు. లఖ్‌నవ్‌లో సామాజిక్ పరివర్తన్ మోర్చా కూటమి సభలో ఒవైసీ మాట్లాడారు. తమ కూటమి నేత చంద్రశేఖర్ ఆజాద్.. సీఎం కానున్నారని జోస్యం చెప్పారు.