Share News

సల్మాన్‌.. నీ ఇంట్లోని కుక్కను కూడా వదిలిపెట్టం

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:33 AM

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, ఆయన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ పండిట్‌ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ కలకలం రేపుతోంది.

సల్మాన్‌.. నీ ఇంట్లోని కుక్కను కూడా వదిలిపెట్టం

  • బాలీవుడ్‌ నటుడికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ మళ్లీ బెదిరింపులు..

  • లారెన్స్‌ బిష్ణోయ్‌, బిష్ణోయ్‌ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌

  • లేదంటే కుటుంబాన్నే నాశనం చేస్తామని వార్నింగ్‌

  • బాంద్రాలోని సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద భద్రత పెంపు

  • టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్టు

  • రాజస్థాన్‌లో రైలులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

న్యూఢిల్లీ/ముంబై, అక్టోబరు 19: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌, ఆయన కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ పండిట్‌ పేరిట విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్‌ కలకలం రేపుతోంది. ముంబైలో మరో నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగిన మరుసటి రోజే వెలుగులోకి వచ్చిన ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సల్మాన్‌ ఖాన్‌.. నా అన్న లారెన్స్‌ బిష్ణోయ్‌, బిష్ణోయ్‌ సమాజానికి క్షమాపణలు చెప్పు.. లేదంటే నీ ఇంట్లో కుక్కను కూడా వదిలిపెట్టం. నీ కుటుంబాన్ని నాశనం చేస్తాం.. నీకు భద్రత ఉందని.. నీకేమి జరగదని అస్సలు అనుకోవద్దు..’ అంటూ ఆడియోలో తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ ఆడియో నిజమైనదా.. కాదా అని తేల్చేందుకు ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కృష్ణ జింకలను వేటాడిన (1998 నాటి) కేసులో నిందితుడిగా ఉన్న సల్మాన్‌పై ఇప్పటికే బిష్ణోయ్‌ ముఠా పలుమార్లు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.. తాజా పరిణామాలతో సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద భద్రతను మరింత పెంచారు. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ నివాసం వెలుపల ముంబై పోలీసులు పహారా కాస్తూ అటుగా వెళ్తున్న వాహనాల తనిఖీ చేపట్టారు. ఇటు టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం కేసులో ఓ మైనర్‌ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో పుణె-జైపూర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బిహార్‌ బెగుసరాయ్‌కు చెందిన రితిక్‌ అలియాస్‌ రోషన్‌, హరియాణాలోని సోనిపట్‌కు చెందిన రేహాన్‌, మరో మైనర్‌ బాలుడున్నారని కోటా ఎస్పీ తేజస్విని తెలిపారు.


నిందితులు పుణె-జైపూర్‌ రైలు ఎక్కినట్లు సమాచారం రావడంతో దాదాపు 15 నిమిషాల పాటు కోటా రైల్వే స్టేషన్‌లో ఆపరేషన్‌ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. కోటా నుంచి ఢిల్లీకి.. అటు నుంచి నేపాల్‌కు పారిపోయేందుకు వారు ప్లాన్‌ చేసుకున్నారన్నారు. బిష్ణోయ్‌ ముఠాకు చెందిన అనిల్‌ పండిట్‌తో రేహాన్‌కు సంబంధాలున్నాయని.. దాడికి ముందు ఆ ముగ్గురు రూ.50 వేలు తీసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కోటా చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు.. నిందితులను ముంబై తరలించేందుకు ట్రాన్సిట్‌ రిమాండ్‌ కోసం మేజిస్ట్రేట్‌ ముందు వారిని హాజరుపరిచారు.


ఏ ఒక్కరినీ విడిచిపెట్టం: సీఎం ఫడ్నవీస్‌

ఇటు కాల్పుల ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సీరియ్‌స గా స్పందించారు. దాడికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్నారు. టైగర్‌ ష్రాఫ్‌తో ఫోన్‌లో మాట్లాడి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే టైగర్‌ ష్రాఫ్‌ను ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు. టైగర్‌ ష్రాఫ్‌ కుటుంబానికి పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. అయితే తనను ఎందుకు టార్గెట్‌ చేశారో తెలియట్లేదని.. గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని, ఎవరితోనూ శత్రుత్వం లేదని టైగర్‌ ష్రాఫ్‌ శిందేతో చెప్పినట్లు సమాచారం. అలాగే బిష్ణోయ్‌ గ్యాంగ్‌, సల్మాన్‌ ఖాన్‌కు సంబంధించిన వ్యవహారాలతో ఏ సంబంధం లేదని పేర్కొనట్లు తెలిసింది.

Updated Date - Oct 20 , 2026 | 05:35 AM