శబరిమల బంగారం చోరీ కేసులో నటుడు జయరామ్‌ను ప్రశ్నించిన సిట్
ABN , Publish Date - Jan 31 , 2026 | 03:42 AM
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాల అదృశ్యం కేసులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్‌ను శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం..
చెన్నై, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాల అదృశ్యం కేసులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్‌ను శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించింది. చెన్నైలోని ఆయన నివాసానికి వచ్చిన సిట్ అధికారులు 2019లో చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమాల గురించి ఆరా తీసి, వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో జయరామ్‌ను సాక్షిగా చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అయితే, తాను 40 ఏళ్లుగా శబరిమలకు వెళ్తున్నానని, ఆ సందర్భంగా ఉన్నికృష్ణన్ పొత్తితో పరిచయం ఏర్పడిందని సిట్ బృందానికి జయరామ్ చెప్పారు. మరమ్మతుల కోసం ఆ బంగారు రేకులను తెచ్చినట్లు ఉన్నికృష్ణన్ చెప్పాడని వివరించారు. ఆ రేకులకు పూజలు చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్పడంతోనే పూజకు అంగీకరించానని, పూజలు చేసినందుకు ఉన్నికృష్ణన్‌కు తాను ఎలాంటి నగదు చెల్లించలేదని కూడా జయరామ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొత్తి.. శబరిమల బంగారు రేకులను 2019లో చెన్నై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు ధనవంతుల ఇళ్లకు, కార్యాలయాలకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు జరిపి లక్షలాది రూపాయలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని జయరామ్ నివాసంలోనూ బంగారు రేకులకు పూజలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. మరోవైపు, ఈ కేసులో అరెస్టు అయిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్టు (టీడీబీ) మాజీ అధికారులు బి.మురారి బాబు, ఎస్.శ్రీకుమార్‌లకు కోర్టు స్టాట్యూటరీ బెయిల్ మంజూరు చేసింది.