హైటెన్షన్ వైర్లలో చిక్కుకున్న పారాగ్లైడర్ పైలట్.. త్రుటిలో తప్పిన ముప్పు
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:33 PM
హైటెన్షన్ వైర్లలో చిక్కుకున్న ఓ రష్యన్ పారాగ్లైడర్ పైలట్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: హైటెన్షన్ వైర్లలో చిక్కుకున్న ఓ రష్యన్ పారాగ్లైడర్ పైలట్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా ఈ ఘటన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మండీ జిల్లా బిర్ బిల్లింగ్ పారాగ్లైడింగ్ ప్రదేశం నుంచి పారాషూట్‌తో బయలుదేరిన అలెక్సీ కొంత దూరం వెళ్లాక ఈ ప్రమాదం జరిగింది. అలెక్సీ పారాషూట్ హైటెన్షన్ వైర్లకు చిక్కుకుపోవడంతో ఆయన దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి వేలాడారు.
ఆయన వైర్‌లకు చిక్కుకుని కనిపించడంతో తోటి పారాగ్లైడర్ పైలట్లు వెంటనే బిర్ బిల్లింగ్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. ఆ తరువాత అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సహా పలు బృందాలు రంగంలోకి దిగాయి.
దాదాపు 2.5 గంటల పాటు శ్రమించి అలెక్సీని సిబ్బంది రక్షించారు. 143 అడుగుల క్రేన్ సాయంతో సురక్షితంగా కిందకు చేర్చారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యగా కింద నేలపై భారీ టార్పాలిన్లు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఒకానొక దశలో ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌తో అలెక్సీని రక్షించాలని అనుకున్నారు. అదృష్టవశాత్తూ ఆయన సులువుగా కిందకు దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సహాయక చర్యల్లో రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ నేరాల అడ్డుకట్టకు నివేదిక ఇవ్వండి.. సోషల్ మీడియా కంపెనీలకు సుప్రీం ఆదేశం
సోనియా గాంధీ ఆత్మకథలో వ్యక్తిగత ఆరోగ్య రహస్యాలు!