గ్రామీణ ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:59 AM
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే పట్టణ కేంద్రాలకు ఆవల క్లీన్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ, నవంబరు 1: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, అలాగే పట్టణ కేంద్రాలకు ఆవల క్లీన్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను విస్తరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పంచాయతీలకు చెందిన భూముల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ శ్వాపింగ్ (మార్పిడి) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. పంచాయతీ ప్రాంగణాలు, జాతీయ, రాష్ట్ర హైవేల వెంబడి ఉన్న స్థలాలు సహా తగిన ప్రాంతాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ శ్వాపింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు మీడియం, హెవీ వాహనాలకు ఉపయోగపడేలా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.