Share News

ఆర్టీఐ పదవులు రిటైర్మెంట్‌ తర్వాత ఇచ్చేవి కావు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:00 AM

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో నిర్లక్ష్యం, దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లలో పెండింగ్‌ కేసులు పేరుకుపోవడం, పోస్టులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆర్టీఐ పదవులు రిటైర్మెంట్‌ తర్వాత ఇచ్చేవి కావు

  • 2 నెలల్లో ఖాళీలను భర్తీ చేయండి

  • అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అమలులో నిర్లక్ష్యం, దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్లలో పెండింగ్‌ కేసులు పేరుకుపోవడం, పోస్టులు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని కాపాడటంలో కమిషనర్ల నియామకం అత్యంత కీలకమని పేర్కొంది. సమాచార కమిషన్లలో పదవులను కేవలం ‘రిటైర్మెంట్‌ తర్వాత ఇచ్చే పదవులు’గా చూడవద్దని, పనిభారానికి అనుగుణంగా సిబ్బంది సంఖ్య ఉండాలని హితవు పలికింది. దేశవ్యాప్తంగా సమాచార కమిషన్లలో నియామక ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్‌ 2019 సెప్టెంబరు 11న సుప్రీంకోర్టులో మిస్‌లీనియస్‌ అప్లికేషన్‌ (ఎంఏ) దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఒడిసా, కర్ణాటక రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఆ పిటిషన్‌ మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉండటం ఆందోళనకరం. ఒక సంస్థ పని చేయకుండా పోతే ప్రజలు అప్పీళ్లు దాఖలు చేయడం మానేస్తారు. ఇది ఆర్టీఐ చట్టం ప్రధాన ఉద్దేశాన్నే దెబ్బతీసే ప్రమాదముంద’ని వ్యాఖ్యానించింది. కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా, ఆ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలని కేంద్రంతో పాటు రాష్ట్రాలకు సూచించింది. తెలంగాణలో ఒక పోస్టు మాత్రమే ఖాళీ ఉందని గత ఏడాది డిసెంబరు 1న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గుర్తు చేశారు. ఆ పోస్టును భర్తీ చేశారా, లేదా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందజేయలేదని తెలిపారు. మహారాష్ట్రలో సుమారు 80 వేల ఆర్టీఐ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 02:00 AM