24న ఆర్టీసీ కార్మికుల ‘చలో సచివాలయం’
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:00 AM
ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ అంశాలపై సర్కారు సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ...
హైదరాబాద్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, పెండింగ్ అంశాలపై సర్కారు సత్వరమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఈ నెల 24న ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఏసీ ఛైర్మన్ వెంకన్న తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రెండున్నరేళ్ల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో పలు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, యూనియన్లపై ఆంక్షల ఎత్తివేత, 2021 వేతన సవరణ అమలు, ఆర్టీసీ విస్తరణ, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాల కల్పిన, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినా.. ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.