సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:40 AM
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదేశిస్తే దిగిపోవడానికి సిద్ధమేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. తనకు 75 ఏళ్లు పూర్తయ్యాయని, సాధారణంగా 75 ఏళ్లు దాటాక ఏ పదవిలోనూ లేకుండా పనిచేయాలంటారని.....
అప్పుడు ఆ పురస్కారానికే ప్రతిష్ఠ
వివాదాల్లేని ఉమ్మడి పౌరస్మృతి అవసరం
బంగ్లాలో హిందువులు ఐక్యంగా పోరాడాలి
నాకు 75 ఏళ్లు నిండాయి.. అయినా పదవిలో కొనసాగాలని సంఘ్ చెప్పింది
ఆదేశిస్తే దిగిపోతా: మోహన్ భాగవత్
ముంబై, ఫిబ్రవరి 8: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆదేశిస్తే దిగిపోవడానికి సిద్ధమేనని ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. తనకు 75 ఏళ్లు పూర్తయ్యాయని, సాధారణంగా 75 ఏళ్లు దాటాక ఏ పదవిలోనూ లేకుండా పనిచేయాలంటారని, సంఘ్ ఆదేశిస్తే తప్పుకుంటానని చెప్పారు. అయితే తనను సంఘ్ కొనసాగాలని చెప్పిందన్నారు. ముంబైలో జరిగిన సంఘ్ శతాబ్ధి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-సంఘ్ పరివార్‌లో రిటైర్‌మెంట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో భాగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
మెజారిటీ, మైనారిటీ లేదు.. అంతా ఒకటే
అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి వివాదాల్లేకుండా ఉమ్మడి పౌరస్మృతి రూపొందించాలని భాగవత్ అన్నారు. మెజార్టీ, మైనార్టీ లేదని, అంతా ఒకటే సమాజమన్నారు. ముస్లిం, క్రైస్తవ సమాజాలతో పరస్పర విశ్వాసం, స్నేహంతో చర్చలు సాగాలన్నారు. జనాభా అసంతులనకు మతమార్పిళ్లు, అక్రమ చొరబాట్లు, జననాల రేటు తగ్గడం కారణమని చెప్పారు. కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని, అయితే ఇది ఆయా కుటుంబాల ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నారు. ప్రలోభాలతో పాటు బలవంతంగా మతం మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు ఘర్ వాపసీ సరైన పరిష్కారమని చెప్పారు. దేశంలో ప్రస్తుతం కులాన్ని రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. ఏ కులం వారైనా సంఘ్ చీఫ్ కావొచ్చని భాగవత్ స్పష్టం చేశారు. వందేళ్ల ఆర్‌ఎ్‌సఎస్ యువ సంస్థ అని చెబుతూ, కార్యకర్తల సగటు వయసు 28అని, 25కు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు భావిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో 1.25కోట్ల మంది హిందువులు ఐకమత్యంతో పోరాడాలని సూచించారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే దాని ప్రతిష్ఠ పెరుగుతుందని భాగవత్ చెప్పారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ మండిపడింది. సావర్కర్‌కు ఏ ప్రాతిపదికన భారతరత్న ఇవ్వాలని ప్రశ్నించింది.