సైబర్ నేరాల ద్వారా రూ.54వేల కోట్ల దోపిడీ!
ABN , Publish Date - Feb 10 , 2026 | 03:24 AM
దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తమ్మీద రూ.54వేల కోట్ల మేర చోరీ జరిగిందని...
ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ
నివారణకు రూల్స్ రూపొందించండి
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తమ్మీద రూ.54వేల కోట్ల మేర చోరీ జరిగిందని, ఇది దారి దోపిడీయేనని వ్యాఖ్యానించింది. వీటిని నివారించేందుకు రిజర్వు బ్యాంకు, టెలికాం శాఖలతో సంప్రదించి విధివిధానాలు, నిబంధనలను రూపొందించాలని సోమవారం కేంద్ర హోం శాఖను ఆదేశించింది. విధివిధానాలతో పాటు, వాటిని అమలు చేసేందుకు కుదుర్చుకునే అవగాహన ఒప్పందాన్ని నాలుగు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంవల్లగానీ, కుమ్మక్కువల్లగానీ ఈ నేరాలు జరుగుతున్నట్టు కేసును విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. సైబర్ నేరం జరిగినప్పుడు వెంటనే హెచ్చరించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సేవలను ఎందుకు ఉపయోగించుకోకూడదని ప్రశ్నించింది. భారీగా నగదు విత్ డ్రా అయిన సందర్భాల్లో వినియోగదారులను హెచ్చరించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని తెలిపింది. సైబర్ నేరగాళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తుండడాన్ని తప్పుపట్టింది. డిజిటల్ అరెస్టులపై దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.