Share News

రూ.11 ఐవీ సెట్‌కు రూ.325

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:23 AM

మహారాష్ట్రలో నాణ్యతలేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌ తుకారాం ముండే..

రూ.11 ఐవీ సెట్‌కు రూ.325

  • రూ.6.75 సిరెంజికి రూ.57.20 వసూలు

  • మహారాష్ట్రలో ప్రైవేటు ఆస్పత్రుల మాయాజాలం

  • ఎఫ్‌డీఏ కమిషనర్‌ తుకారాం ముండే వెల్లడి

ముంబై, సెప్టెంబరు 16: మహారాష్ట్రలో నాణ్యతలేని ఆహార పదార్థాలను విక్రయిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌ తుకారాం ముండే.. ప్రైవేటు ఆస్పత్రుల డోపిడీ బండారాన్ని కూడా బయటపెట్టారు. రోగులకు సెలైన్‌ అందించే ఐవీ ఇన్‌ఫూజన్‌ సెట్‌ ఉత్పత్తి ఖర్చు రూ.11.05 మాత్రమే ఉండగా.. ఆస్పత్రులు దానికి ఏకంగా రూ.325 వసూలు చేస్తున్నట్లు ఆయన బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. వీటిని ఉత్పత్తి ఖర్చుతో పోల్చితే 2,841 శాతం అధిక లాభాలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులకు వినియోగిస్తున్న పరికరాల ఉత్పత్తి ఖర్చు.. వాటిని విక్రయిస్తున్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)లపై ఎఫ్‌డీఏ సర్వేలో విస్తుపోయే విషయాలు తెలిసినట్లు వెల్లడించారు. సిరెంజి ఉత్పత్తి ఖర్చు రూ.6.75 ఉండగా, మెడికల్‌ బిల్లులో రూ.57.20 వేస్తున్నట్లు తెలిపారు. మూత్రం వంటి మలినాలను శరీరం నుంచి బయటకు పంపించేందుకు వినియోగించే క్యాథటర్‌ పైపు ఉత్పత్తి వ్యయం రూ.29.41 ఉండగా.. రూ.310 వసూలు చేస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని చెప్పారు. ఇంత భారీ మొత్తం వసూలు చేస్తున్నట్లు రోగులకు కనీసం అవగాహన కూడా ఉండటం లేదని, ఆస్పత్రులు వాటి ఉత్పత్తి ఖర్చులను ఉద్దేశపూర్వకంగానే రోగులకు తెలియకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించారు. కొన్ని ఔషధాలపై డ్రగ్స్‌ (ప్రైస్‌ కంట్రోల్‌) ఆర్డర్‌-2013 ప్రకారం నియంత్రణ ఉన్నప్పటికీ.. వైద్య పరికరాలపై నియంత్రణ లేదని.. అందువల్లే ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్లు ధరలు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు.

Updated Date - Sep 17 , 2026 | 06:24 AM