BMC Election in Mumbai: ముంబైలో రిసార్టు రాజకీయాలు
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:34 AM
దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో రిసార్టు రాజకీయాలకు తెరలేచింది.
ముంబై, జనవరి 17: దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోవటంతో రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. తన మద్దతు(శివసేన) లేకుండా పాలకమండలి కొలువుదీరే పరిస్థితి లేకపోవటంతో ఏక్‌నాథ్ షిండే బీజేపీతో బేరసారాలు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన శనివారం తన కార్పొరేటర్లను ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు తరలించారు. ఏకంగా బీఎంసీ మేయర్ పదవి కోసమే బీజేపీ ముందు డిమాండ్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ పదవి దశాబ్దాలుగా శివసేన చేతిలోనే ఉందని షిండే పార్టీ కార్పొరేటర్లు తమ అధినేతకు గట్టిగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శుక్రవారం వెళ్లడైన బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 89 సీట్లు గెలిచింది. దాని మిత్రపక్షాలైన శివసేన 29, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 3స్థానాల్లో గెలిచాయి. 227 వార్డులున్న బీఎంసీలో మేయర్ సీటు దక్కించుకోవాలంటే 114మంది మద్దతు అవసరం. బీజేపీ, శివసేన సభ్యులను కలిపితే 118 అవుతుంది. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కలిపితే మెజారిటీ మార్కుకు 8 సీట్లు మాత్రమే తగ్గుతున్నాయి.