Share News

హస్తిన.. త్రివర్ణ శోభితం

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:19 AM

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. తొలిసారి బ్యాటిల్‌ ఆరే ఫార్మాట్‌లో సైన్యం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హస్తిన.. త్రివర్ణ శోభితం

  • అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

  • కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. తొలిసారి బ్యాటిల్‌ ఆరే ఫార్మాట్‌లో సైన్యం నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్‌లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. సైనిక శక్తి, త్రివిధ దళాల ఐక్యత, సాంస్కృతిక వైభవం ఒకే వేదికపై కలిసిన ఈ వేడుక దేశ ప్రజల్లో నూతనోత్తేజం నింపింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్‌ సిందూర్‌ సహా ఇతర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యుద్ధ భూమిలో జరిగే ప్రతి దశను సైన్యం ఈ పరేడ్‌లో తొలిసారి ప్రదర్శించింది. గూఢచర్యం నుంచి ప్రధాన దాడి, రక్షణ చర్యలు, మద్దతు వ్యవస్థల వరకు యుద్ధ క్రమాన్ని ప్రదర్శించారు. భైరవ్‌ లైట్‌ కమాండో బెటాలియన్‌ తొలిసారి పరేడ్‌లో పాల్గొంది. నిగ్రహ, భైరవ్‌, భువిరక్ష, కృష్ణ వంటి స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలు కూడా మొదటిసారి పరేడ్‌లో పాల్గొన్నాయి. ముఖ్యంగా పరేడ్‌లో ఆపరేషన్‌ సిందూర్‌ ప్రదర్శన చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. విక్టరీ త్రూ జాయింట్‌నెస్‌ పేరుతో సైన్యం, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్త ఆపరేషన్‌ను రిపబ్లిక్‌ డే వేదికపై తొలిసారి ఆవిష్కరించాయి. మహిళలతో కూడిన ఇండియన్‌ కోస్‌గార్డ్‌ బృందం కూడా ప్రదర్శన ఇచ్చింది. డీఆర్‌డీవో ప్రదర్శన ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బాక్ట్రియన్‌ ఒంటెలు, జాన్స్కర్‌ పోనీలు, రాప్టర్స్‌, దేశీయ శునకాలకు బుల్లెట్‌ప్రూఫ్‌ గేర్‌, కెమెరాలు, జీపీఎస్‌ అమర్చిన విధానాన్ని తొలిసారి పరేడ్‌లో ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం థీమ్‌తో కళాకారులు దేశవ్యాప్తంగా వాడుకలో ఉన్న వాయిద్యాలతో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. 2,500 మంది కళాకారులతో జరిగిన ‘వందేమాతరం - ది ఎటర్నల్‌ రెజోనెన్స్‌ ఆఫ్‌ భారత్‌’ నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 13 కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 30 శకటాలు దేశ సంస్కృతి, వారసత్వం, ఆత్మనిర్భరత, పాలనలో పురోగతిని ప్రతిబింబించాయి. 29 యుద్ధ విమానాలతో నిర్వహించిన ఫ్లై పాస్ట్‌ ఆకట్టుకుంది. రఫేల్‌, సుఖోయ్‌ 30 ఎంకేఐ, మిగ్‌ 29, జాగ్వార్‌ వంటి యుద్ధ విమానాల విన్యాసాలు చూపరులను కట్టి పడేశాయి. ఈ వేడుకలకు యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లేయెన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. కాగా, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు మూడో వరుసలో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్‌ పార్టీ సహా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.


ప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం

సైనిక శక్తితోపాటు అద్భుత సాంస్కృతిక వైభవానికి కర్తవ్యపథ్‌ సోమవారం వేదికగా నిలిచింది. ‘వివిఽధ్‌తా మే ఏక్‌ తా’ (భిన్నత్వంలో ఏకత్వం) నినాదంతో వేడుకల ఆరంభంలో సాగిన 3 నిమిషాల కళాకారుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల వాయిద్యాలతో సాగిన ‘వందేమాతర’ గీతం అలరించింది. మొత్తం 270 మంది కళాకారులు ఈ కవాతులో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గుడోలు కళాకారుడు డాక్టర్‌ ఒగ్గు రవి బృందం ఇందులో పాల్గొంది. కళాకారుల ప్రదర్శనను రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు.

వందేమాతరానికి ఎంఎం కీరవాణి కొత్త బాణీలు..

వందేమాతరం గీతం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కొత్తగా స్వరపరిచిన వందేమాతరం గీతం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్‌ చివరలో ఆయన సమకూర్చిన కొత్త బాణీలకు అనుగుణంగా 2,500 మంది కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అలాగే తొలిసారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన 133 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ వేడుకల్లో కవాతు చేశారు.

గణతంత్ర దినోత్సవం దేశ గౌరవానికి ప్రతీక: మోదీ

దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ గౌరవానికి, గర్వానికి, వైభవానికి ప్రతీక అయిన మహోన్నతమైన ఈ రోజుఅందరి జీవితాల్లో కొత్త శక్తి, నూతన ఉత్సాహాన్ని నింపాలని ఎక్స్‌ వేదికగా ఆకాంక్షించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలపై నిలిచిన ఒక చైతన్యవంతమైన గణతంత్ర దేశం భారత్‌ అని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌ అన్నారు. భారత గణతంత్రానికి రాజ్యాంగమే పునాది అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

2.jpg3.jpg4.jpg5.jpg1.jpg

Updated Date - Jan 27 , 2026 | 03:19 AM