యుద్ధ భేరి.. సంగీత కచేరి
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:55 AM
సైనిక శక్తితోపాటు అద్భుత సాంస్కృతిక వైభవానికి కర్తవ్యపథ్ సోమవారం వేదికగా నిలిచింది. ‘వివిధ్‌తా మే ఏక్ తా’ (భిన్నత్వంలో ఏకత్వం) నినాదంతో వేడుకల ఆరంభంలో సాగిన 3 నిమిషాల కళాకారుల...
ఢిల్లీలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
తొలిసారి బ్యాటిల్ ఆరే ఫార్మాట్‌లో సైన్యం కవాతు
2,500 మంది కళాకారులతో వందేమాతరం ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి బాణీలు
ప్రత్యేక ఆకర్షణగా వందేమాతరం
సైనిక శక్తితోపాటు అద్భుత సాంస్కృతిక వైభవానికి కర్తవ్యపథ్ సోమవారం వేదికగా నిలిచింది. ‘వివిధ్‌తా మే ఏక్ తా’ (భిన్నత్వంలో ఏకత్వం) నినాదంతో వేడుకల ఆరంభంలో సాగిన 3 నిమిషాల కళాకారుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల వాయిద్యాలతో సాగిన ‘వందేమాతర’ గీతం అలరించింది. మొత్తం 270 మంది కళాకారులు ఈ కవాతులో పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గుడోలు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి బృందం ఇందులో పాల్గొంది. కళాకారుల ప్రదర్శనను రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు.
వందేమాతరానికి కీరవాణి కొత్త బాణీలు..
వందేమాతరం గీతం 150 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కొత్తగా స్వరపరిచిన వందేమాతరం గీతం గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్ చివరలో ఆయన సమకూర్చిన కొత్త బాణీలకు అనుగుణంగా 2,500 మంది కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. అలాగే తొలిసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 133 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ వేడుకల్లో కవాతు చేశారు.
గణతంత్ర దినోత్సవం దేశ గౌరవానికి ప్రతీక: మోదీ
దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ గౌరవానికి, గర్వానికి, వైభవానికి ప్రతీక అయిన మహోన్నతమైన ఈ రోజుఅందరి జీవితాల్లో కొత్త శక్తి, నూతన ఉత్సాహాన్ని నింపాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలపై నిలిచిన ఒక చైతన్యవంతమైన గణతంత్ర దేశం భారత్ అని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. భారత గణతంత్రానికి రాజ్యాంగమే పునాది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
