Share News

పోటీకి సై

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:02 AM

భారత శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ (శాట్‌కామ్‌) రంగంలో ఎలన్‌మ్‌స్కకు చెందిన స్టార్‌లింక్‌తో సహా ఏ కంపెనీ పోటీనైనా తాము స్వాగతిస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ శుక్రవారం స్పష్టం చేసింది.

పోటీకి సై
mukesh

  • కానీ భారతీయ చట్టాలకు లోబడి నడుచుకోవాల్సిందే

  • స్టార్‌లింక్‌ సహా ఎవరొచ్చినా స్వాగతిస్తాం

  • పోటీకి ఎప్పుడూ భయపడింది లేదు..

  • నిబంధనలు అందరికీ ఒక్కటే!

  • మెరుగైన సేవలకు పోటీయే నిజమైన పరీక్ష: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

  • మస్క్‌ ఆరోపణలపై మౌనం వీడిన సంస్థ

న్యూఢిల్లీ, అక్టోబరు 16: భారత శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ (శాట్‌కామ్‌) రంగంలో ఎలన్‌మ్‌స్కకు చెందిన స్టార్‌లింక్‌తో సహా ఏ కంపెనీ పోటీనైనా తాము స్వాగతిస్తున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే, భారతీయ కంపెనీ అయినా, విదేశీ సంస్థ అయినా దేశ చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని ఉద్దేశిస్తూఎక్స్‌ అధినేత ఎలన్‌మస్క్ ఇటీవల చేసిన విమర్శలపై కంపెనీ తొలిసారిగా మౌనం వీడింది. తమకు పోటీ అంటే ఎప్పుడూ భయం లేదని, వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనే దానికి పోటీనే నిజమైన పరీక్ష అని స్పష్టం చేసింది. 2016లో ఒక్క కస్టమర్‌ కూడా లేకుండా టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో, పదేళ్లలోనే 53కోట్లకు పైగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకుందని పేర్కొంది. స్టార్‌లింక్‌కు లైసెన్సు ఇవ్వకుండా కొందరు వ్యాపార దిగ్గజాలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలను తిప్పికొడుతూ.. జియో సొంత శాటిలైట్‌ సేవలకు కూడా ఇంకా అనుమతులు రావాల్సి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. స్వదేశీయులైనా, విదేశీయులైనా ప్రతి దరఖాస్తుదారునికి ప్రభుత్వం ఒకే రకమైన అనుమతుల ప్రక్రియ వర్తింపజేస్తుందని తెలిపింది. మరోవైపు, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ కూడా స్పందిస్తూ.. అనుమతుల రేసులో మస్క్‌ కంటే తాము ఐదేళ్ల ముందు ఉన్నామని అన్నారు.


వివాదం నేపథ్యం

భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్‌ ఐదేళ్లుగా ప్రయత్నిస్తోందని, అయితే దేశంలోని కొన్ని శక్తిమంతమైన వ్యాపార వర్గాలు తమ ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం స్కార్‌లింక్‌ రాకను అడ్డుకుంటున్నాయని మస్క్‌ ఆరోపించారు. ‘భారత్‌కు అసలు బాస్‌ అంబానీనా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ ఆరోపణలను కేంద్రం తక్షణమే తోసిపుచ్చింది. స్టార్‌లింక్‌, జియో శాటిలైట్‌, ఎయిర్‌టెల్‌కు చెందిన వన్‌వెబ్‌.. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఒకేవిధమైన రెగ్యులేటరీ దశలో ఉన్నాయని, హోం శాఖ నుంచి తుది అనుమతులు రాగానే కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేసింది.

Updated Date - Oct 17 , 2026 | 06:02 AM