Share News

నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ప్రాంతీయ శక్తులకు ప్రతిష్ఠాత్మకం!

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:32 AM

నాలుగు రాష్ట్రాలకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. ప్రాంతీయంగా తిరుగులేని నేతలుగా చలామణి అవుతున్న నేతలకు అగ్నిపరీక్షగా మారాయి.

నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ప్రాంతీయ శక్తులకు ప్రతిష్ఠాత్మకం!

నాలుగు రాష్ట్రాలకు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. ప్రాంతీయంగా తిరుగులేని నేతలుగా చలామణి అవుతున్న నేతలకు అగ్నిపరీక్షగా మారాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అసోం ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్‌(డీఎంకే), మమతా బెనర్జీ (టీఎంసీ), పినరయి విజయన్‌ (సీపీఎం), హిమంతబిశ్వ శర్మ(బీజేపీ) ఆయా రాష్ట్రాల్లో సంపూర్ణాధికారం చలాయిస్తున్నారు. స్టాలిన్‌, మమత, విజయన్‌ మాటకు పార్టీలో, ప్రభుత్వంలో తిరుగులేదు. బీజేపీలో ఏ నేతకూ అలాంటి పరిస్థితి లేకున్నా.. హిమంత విషయంలో మాత్రం తద్విరుద్ధం. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆయనకు అసోంలో పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పజెప్పారు. ఆ మాటకొస్తే మొత్తం ఈశాన్య భారతంలో పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నలుగురు నేతలకు తాజా అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వీరు ఇప్పుడు తిరిగి అధికారం కోసమే కాదు.. జాతీయ స్థాయిలో తమ పార్టీల/కూటముల ప్రతిష్ఠకోసం పోరాడుతున్నారు.

1.jpg

మమతది నిత్యపోరాటం.. స్టాలిన్‌ సంక్షేమ మంత్రం

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా మమతది నిరంతరం పోరాట బాటే. సొంత పార్టీ కాంగ్రెస్‌ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసి తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఏర్పాటుచేసిన ఆమె.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సీఎం అయ్యారు. 2016, 21ల్లోనూ గెలిపించి హ్యాట్రిక్‌ సృష్టించారు. 2019 వరకు రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ క్రమంగా ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలు మాత్రమే గెలిచిన ఆ పార్టీ.. 2019లో ఏకంగా 18 చోట్ల గెలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరోవైపు, తండ్రి కరుణానిధి మరణానంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో జట్టుకట్టి డీఎంకేను పదేళ్ల తర్వాత తమినాడులో అధికారంలోకి తీసుకొచ్చిన స్టాలిన్‌..ఈ ఐదేళ్లలో సీఎంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. తన పాలనకు ‘ద్రవిడియన్‌ మోడల్‌’ అని పేరుపెట్టి ప్రతి వర్గానికీ లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా వరాల వర్షం కురిపిస్తున్నారు. ఇది రెండోసారి తనను విజయతీరాలను చేర్చడమే గాక.. జాతీయ రాజకీయాల్లో కీలక భూమికకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు.


సవాళ్లకు విజయన్‌ సిద్ధం.. హిమంత మంచి వ్యూహకర్త

కేరళ సీఎం విజయన్‌ సీపీఎంలో క్షేత్ర స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన నేత. మంచి వ్యూహకర్త. సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం ఇష్టపడతారు. 2016లో తన పార్టీ సారథ్యంలోని ఎల్‌డీఎఫ్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీ కాగా.. దానికి భిన్నంగా తన పాలనా సామర్థ్యంతో 2021లో కూడా ఎల్‌డీఎఫ్‌ను గెలిపించడం విశేషం. తన సంక్షేమ పథకాలతో హ్యాట్రిక్‌ కొట్టి తీరుతామని విజయన్‌ ధీమాగా ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ఎదిగిన హిమంత బిశ్వ శర్మ గొప్ప వ్యూహకర్తగా పేరుపొందారు. ఆ పార్టీ సీనియర్‌ నేత తరుణ్‌ గొగోయ్‌ 2001 నుంచి 16 వరకు సీఎంగా కొనసాగినా.. మూడుసార్లు కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హిమంత కీలక భూమిక నిర్వహించారు. అయితే గొగోయ్‌ తనను అణచివేసే చర్యలకు కినిసి తన సహచరులతో కలిసి బీజేపీలో చేరిపోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. 2021లో సీఎం పదవి చేపట్టారు. తాజాగా మరోసారి ఆయన సారథ్యంలోనే ఎన్‌డీఏ బరిలోకి దిగుతోంది.

- సెంట్రల్‌ డెస్క్‌.

Updated Date - Apr 06 , 2026 | 04:39 AM