ఉగ్ర డాక్టర్ల ఇళ్లలోనే బాంబుల తయారీ
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:02 AM
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది నవంబరు 10న జరిగిన బాంబు దాడుల కేసును విచారించిన జమ్ముకశ్మీర్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు...
వారి అసలు లక్ష్యం ఏజీహెచ్ పునరుద్ధరణే
ఎర్రకోట బాంబు దాడుల కేసులో ఎస్‌ఐఏ చార్జిషీట్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది నవంబరు 10న జరిగిన బాంబు దాడుల కేసును విచారించిన జమ్ముకశ్మీర్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. డాక్టర్ల నేతృత్వంలోని ఉగ్రవాద ముఠా అసలు లక్ష్యం మరో ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్(ఏజీహెచ్)ను పునరుద్ధరించడమేనని వెల్లడించారు. తమ నివాసాలను, వైద్య విద్యా సంస్థలను బాంబుల తయారీ కేంద్రాలుగా మలుచుకున్నారని తెలిపారు. అత్యంత సులభంగా లభించే ముడి పదార్థాలను వినియోగించి ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్(టీఏటీపీ)వంటి పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్‌లో కీలక అంశాలను వెల్లడించారు. అల్ ఖాయిదాకు చెందిన అనుబంధ ఉగ్రవాద సంస్థ ఏజీహెచ్‌ను జకీర్ రహిద్ భట్ అలియాస్ జకీర్ మూసా స్థాపించారు. అయితే, 2019లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మూసా హతమయ్యాడు. తర్వాత ఆయన స్థానంలోకి వచ్చిన ముజమిల్ అహ్మద్ తంత్రే కూడా 2021లో చనిపోయారు. అప్పటి నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న ఏజీహెచ్ పునరుద్ధరించేందుకు ఈ ముఠా రంగంలోకి దిగింది. దర్యాప్తు అనంతరం..9మందిని అరెస్టు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిలో డాక్టర్ ముజమిల్ షకీల్, ఆయన భార్య డాక్టర్ షహీన్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథెర్ ఉన్నారని తెలిపారు. ఈ మాడ్యూల్‌లో భాగమైన మరో డాక్టర్, ఫ్యాకల్టీ.. నాటి దాడుల్లో తనను తాను పేల్చుకుని చనిపోయాడని వివరించారు. మరో నిందితుడు ముజఫర్ అహ్మద్‌పై బ్లూ కార్నర్ నోటీసులు జారీచేసేలా ఇంటర్‌పోల్‌ను సంప్రదించినట్టు పేర్కొన్నారు.