రన్యారావ్‌కు ఉగాండా ఏజెంట్ ఝలక్!
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:03 AM
కన్నడ నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడకముందే ఉగాండా ఏజెంట్ చేతిలో రూ.2 కోట్ల మేర మోసపోయినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది
రూ.2 కోట్లు మోసగించినట్టు చార్జిషీట్‌లో ఈడీ వెల్లడి
ఆఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు బంగారం స్మగ్లింగ్
బెంగళూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కన్నడ నటి రన్యారావ్ బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడకముందే ఉగాండా ఏజెంట్ చేతిలో రూ.2 కోట్ల మేర మోసపోయినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో చార్జ్‌షీట్‌ను ఈడీ బుధవారం బెంగళూరులో దాఖలు చేసింది. గతేడాది మార్చిలో దుబాయ్ నుంచి బెంగళూరుకు రూ.12.56 కోట్ల విలువైన 14 కేజీల బంగారాన్ని తీసుకొస్తుండగా రన్యారావ్‌ను విమానాశ్రయంలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పలు వివరాలను చార్జ్‌షీట్‌లో వెల్లడించారు. 2024 మార్చి నుంచి 2025 మార్చి వరకు రూ.102.55 కోట్ల విలువైన 127.28 కేజీల బంగారాన్ని దుబాయ్ నుంచి రన్యారావ్ అక్రమంగా తరలించినట్టు పేర్కొన్నారు. దుబాయ్ మార్కెట్లలో లభించే బంగారంలో చాలావరకు ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ ద్వారా వెలికితీసినదేనని తెలియడంతో రన్యారావ్, ఆమె సహచరుడు తరుణ్ కొండూరురాజు పలు ఆఫ్రికా దేశాల ఎగుమతిదారులను సంప్రదించినట్టు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఉగాండాకు చెందిన బెన్ అనే ఏజెంట్ తొలుత 5 కేజీల బంగారాన్ని సరఫరా చేశాడు. ఆ తర్వాత 50 కేజీలు రవాణా చేసేందుకు కొంత నగదు తీసుకున్నాడు. కానీ, బంగారాన్ని సమకూర్చలేదు. దీంతో 2024 జనవరి 1న తరుణ్ ఉగాండా వెళ్లి బెన్‌ను కలవగా.. అదనంగా మరో రూ.1.70 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో దుబాయ్‌లో ఉండే బెన్ సహచరుడికి నగదు పంపించారు. ఆ తర్వాత తాము మోసపోయిన విషయాన్ని గ్రహించారు. సాక్షుల వాట్సాప్ చాట్‌లో చెల్లింపుల ఆధారాలు లభించినట్లు చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.