Share News

ట్రస్టుకు ముందే తెలుసు!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:20 AM

అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం బహిరంగం కావడానికి ముందే తీర్థక్షేత్ర ట్రస్టుకు తెలుసా?.. నిందితుడిని కూడా ట్రస్టు గుర్తించిందా...

ట్రస్టుకు ముందే తెలుసు!

  • అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారంపై పక్కా సమాచారం ఉంది

  • ఈ నెల 5వ తేదీనే నిందితుడి ఇంట్లోపోలీసులతో కలిసి ట్రస్టు సోదా

అయోధ్య, జూన్‌ 28: అయోధ్య రామాలయంలో విరాళాల దోపిడీ వ్యవహారం బహిరంగం కావడానికి ముందే తీర్థక్షేత్ర ట్రస్టుకు తెలుసా?.. నిందితుడిని కూడా ట్రస్టు గుర్తించిందా?.. అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఈ నెల 7న విరాళాల గోల్‌మాల్‌ వ్యవహారం బయటకు పొక్కింది. అయితే.. దీనికి రెండురోజుల ముందే అంటే.. ఈ నెల 5వ తేదీనే ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు ఈ విషయం తెలుసునని అధికారులు నిర్ధారించారు. అంతేకాదు.. ప్రస్తుతం ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాశ్‌ శుక్లా ఇంట్లో అదే రోజు ట్రస్టు ప్రతినిధులతో పాటు పోలీసులు సోదాలు చేపట్టి కొంత మేరకు నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇంత జరిగినా ట్రస్టు నుంచి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు అందలేదని తెలిపాయి. 5వ తేదీన జరిగిన సోదాలు అనధికారికమని, ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ లేకుండానే సోదాలు చేపట్టినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 7న విషయం వెలుగు చూసిన తర్వాత.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని, దోపిడీ వ్యవహారం ట్రస్టుకు ముందే తెలిసినా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం వెనుక అనేక అనుమానాలు వస్తున్నాయని పేర్కొన్నాయి. కానీ, ఈ కేసు విషయంలో ట్రస్టు చేసిన జాప్యంపై అధికారులు ఇప్పటి వరకు ప్రశ్నించకపోవడం గమనార్హం. ఇదిలావుంటే, 24 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ నల్లటి బ్యాగుతో శుక్లా కనిపించారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ము దానిలో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. మరో ఫొటోలో ఇంకోనిందితుడు రామశంకర్‌ మిశ్రా కూడా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇక, ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని కోణాల్లోనూ కేసును విచారిస్తోంది. అయోధ్య విరాళాల నిర్వహణలోని లోపాలపై దృష్టి పెట్టింది. నగదు స్వీకరణ, ఉద్యోగుల తనిఖీలు, సీసీటీవీ నిర్వహణ వంటి కీలక విషయాలపై విచారణ సాగుతున్నట్టు అధికారి ఒక రు తెలిపారు. కాగా, ఈ కేసును విచారిస్తున్న సిట్‌ తన ప్రాథమిక నివేదికను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఆదివారం అందించింది. అదేరోజు వేర్వేరు ప్రాంతాల్లోని ఎనిమిదిమంది నిందితుల ఇళ్లలో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. కీలక నిందితులు అవినాశ్‌ శుక్లా, లవ్‌కుశ్‌ మిశ్రా, రామశంకర్‌ యాదవ్‌ సహా అందరి ఇళ్లలోనూ తనిఖీలు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, కోర్టు ఈ నెల 29 వరకు నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే.


రాత్రికి రాత్రే కోటీశ్వరులు!

అయోధ్య విరాళాల దోపిడీ వ్యవహారంలో కీలక సూత్రధారి(మాస్టర్‌ మైండ్‌)గా భావిస్తున్న అనుకల్ప్‌ మిశ్రా, ఆయన బావమరిది లవ్‌కుశ్‌ మిశ్రాలు రాత్రికి రాత్రే రూ.కోట్లకు పగడలెత్తడం ఈ కేసు తీవ్రతను స్పష్టం చేస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఆదివారం అనుకల్ప్‌కు చెందిన బసవ గ్రామంలో అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు విలాసవంతమైన భవనాలను గుర్తించారు. అలాగే వారి ఆర్థిక పరిస్థితులపై కుటుంబీకులు సహా చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించారు. అనుకల్ప్‌ నిన్నమొన్నటి వరకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటీవలే భారీ ఎత్తున భవనాలను నిర్మించడంతోపాటు పొలాలు, స్థలాలను కూడా కొనుగోలు చేశారని స్థానికులు తెలిపారు. అయితే, అనుకల్ప్‌ మంచి వాడేనని చెప్పినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అనుకల్ప్‌ తాత రాజేంద్రప్రసాద్‌ ఇచ్చిన సమాచారం మేరకు.. గత ఏప్రిల్‌ 30న ఏడు రోజుల పాటు భారీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి చంపత్‌రాయ్‌ సహా తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించేందుకు అంత సొమ్ము ఎలా వచ్చిందో తనకు తెలియదని పేర్కొన్నారు. ఇక, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుకల్ప్‌ ఇటీవలే వ్యవసాయ క్షేత్రాన్ని నిర్మించారు. గత ఏడాది రూ.65 లక్షలు పెట్టి అయోధ్యలో ఇల్లు కొనుగోలు చేశారు. అయితే.. అనుకల్ప్‌ ఓ బ్యాంకులో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. ఇదిలావుంటే, లవ్‌కుశ్‌ను అనుకల్పే విరాళాలు లెక్కించే ఉద్యోగంలో చేర్చినట్టు గుర్తించారు. లవ్‌కుశ్‌ నిన్న మొన్నటి వరకు అద్దె ఇంట్లో ఉండేవారని, తాజాగా ఆయన రూ.లక్షలు ఖరీదు చేసే వాహనాన్ని కొనుగోలు చేసినట్టు రుదౌళీ ప్రాంతానికి చెందిన స్థానికులు అధికారులకు తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 04:20 AM