రాజ్యసభ ఎన్‌డీఏదే!
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:47 AM
రాజ్యసభలో ఎన్‌డీఏ పుంజుకోనుంది. 245 స్థానాల సభలో ప్రస్తుతం పాలక కూటమికి 133 సీట్లు ఉన్నాయి. మార్చిలో పది రాష్ట్రాల్లోని 37 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో...
మార్చి ఎన్నికలతో 137 సీట్లకు చేరనున్న బలం
పవార్ మళ్లీ ఎన్నికవడం కష్టమే!
అఘాడీ పార్టీలు చేతులు కలిపితేనే చాన్సు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: రాజ్యసభలో ఎన్‌డీఏ పుంజుకోనుంది. 245 స్థానాల సభలో ప్రస్తుతం పాలక కూటమికి 133 సీట్లు ఉన్నాయి. మార్చిలో పది రాష్ట్రాల్లోని 37 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో అదనంగా మరో 4 సీట్లు ఎన్‌డీఏకి దక్కనున్నాయి. అంటే 137 స్థానాలకు చేరుకోబోతోంది. సాధారణ మెజారిటీ (123) కంటే 14 సీట్లు ఎక్కువే. కీలక బిల్లుల ఆమోదానికి ఇతర పార్టీలపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం దానికి ఉండదు. కాగా.. మార్చిలో మరాఠా యోధుడు, ఎన్‌సీపీ-ఎ్‌సపీ అధినేత శరద్ పవార్ పదవీకాలం ముగుస్తోంది. ఈసారి ఆయన గెలవడం కష్టంగానే కనిపిస్తోంది. మహారాష్ట్రలో 7 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో 6 సీట్లు బీజేపీ-శివసేన-ఎన్‌సీపీతో కూడిన మహాయుతికి ఖాయంగా దక్కుతాయి. మహా వికాస్ అఘాడీ భాగస్వాములైన ఉద్ధవ్ సేన, ఎన్‌సీపీ-ఎ్‌సపీ, కాంగ్రెస్ చేతులు కలిపితేనే ఒక స్థానం దక్కే అవకాశం ఉంటుంది. ఉద్ధవ్ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా రిటైరవుతున్నారు. పవార్ పోటీచేస్తే దివంగత అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు (41) ఆయన వైపు మొగ్గుచూపే అవకాశం ఉందని శరద్ పవార్ వర్గీయులు అంటున్నారు. అజిత్ వర్గం దీనిని తోసిపుచ్చుతోంది. అజిత్ ఆకస్మిక మరణంతో ఆయన భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే.
ఆమె ప్రమాణ స్వీకారానికి శరద్ పవార్, ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే హాజరు కాలేదు. దీంతో విలీనం జరిగే అవకాశాల్లేవని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాగా.. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరిగే పది రాష్ట్రాల్లో 6 చోట్ల ఎన్‌డీఏ అధికారంలో ఉంది. వీటిలో మహారాష్ట్ర నుంచి 7, బిహార్-5, ఒడిసా-4, అసోం-3, ఛత్తీస్‌గఢ్-2, హరియాణాలో 2 స్థానాలు ఖాళీ అవుతుండగా.. వీటిలో మహారాష్ట్ర, అసోంలో రెండు స్థానాలు ‘ఇండీ’ కూటమికి దక్కుతాయి. ఒడిసాలో ఒక సీటు బీజేడీకి వెళ్తుంది. మిగతా 20 సీట్లలో ఎన్‌డీఏకే విజయావకాశాలు ఎక్కువ. తమిళనాడులో 6 సీట్లకు గాను పాలక డీఎంకేకు 4, ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ అన్నాడీఎంకేకు రెండు.. బెంగాల్లోని 5 సీట్లలో నాలుగు టీఎంసీకి, ఒకటి బీజేపీకి.. తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక సీటు కాంగ్రెస్‌కు దక్కనున్నాయి. అంటే 37 సీట్లలో ఎన్‌డీఏకి 23, విపక్షాలు, ఇతరులకు 14 వస్తాయన్న మాట.