ఓటమిని గెలిచిన కెరటం
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:59 AM
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా ఆమె కుంగిపోలేదు. శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత కఠినమైన...
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు వైఫల్యం ఎదురైనా ఆమె కుంగిపోలేదు. శిక్షణలో ఉన్న డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశంలో అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో దేశంలోనే రెండో ర్యాంకు సాధించి, అసాధ్యం అనే పదాన్ని సుసాధ్యం చేసి చూపించారు మదురైకి చెందిన రాజేశ్వరి సువే ఎం.
తమిళనాడులోని మదురై జిల్లా వాడిపట్టికి చెందిన రాజేశ్వరిది విద్యావంతుల కుటుంబం. తండ్రి మురుగేశన్ వ్యాపారవేత్త కాగా తల్లి ప్రభుత్వ కళాశాల ప్రొఫెసర్. ఇంట్లోని విద్యా వాతావరణం, కాలేజీ రోజుల్లో ఎన్‌సీసీ క్యాడెట్‌గా పొందిన క్రమశిక్షణే ఆమెను సివిల్స్ వైపు నడిపించాయి. చెన్నైలోని వెల్‌టెక్ మల్టీటెక్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఎలాగైనా దేశ సేవలో భాగం కావాలని అనుకున్నారు.
సొంత నోట్స్.. లోతైన విశ్లేషణ
రాజేశ్వరి ప్రిపరేషన్ శైలి చాలా ప్రత్యేకం. ఆమె కేవలం పుస్తకాలను చదవడమే కాకుండా ప్రతి అంశంపైనా తనదైన శైలిలో షార్ట్ నోట్స్ తయారుచేసుకునేవారు. సమాజంపై అవగాహన పెంచుకునేందుకు సోషియాలజీని ఐచ్ఛికాంశంగా ఎంచుకున్నారు. దినపత్రికలను చదవడం ద్వారా వర్తమాన అంశాలపై పట్టు సాధించారు. ఇప్పటికే గ్రూప్-1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజేశ్వరి విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను తన ఇంటర్వ్యూ సమాధానాలకు ముడిపెట్టి బోర్డు సభ్యులను మెప్పించారు. తెలియని ప్రశ్నలు ఎదురైనప్పుడు తడబడకుండా చాలా హుందాగా ‘తెలియదు’ అని చెప్పడం ఆమె నిజాయితీకి నిదర్శనం. రెండో ర్యాంకు వచ్చిన వారు సహజంగా ఐఏఎస్ ఎంచుకుంటారు. కానీ రాజేశ్వరి మాత్రం తన లక్ష్యం ఐపీఎస్ అని స్పష్టంగా చెప్పారు. ఎన్‌సీసీ రోజుల్లో యూనిఫాం ధరించినప్పుడు కలిగిన గర్వం, మహిళల భద్రత కోసం పనిచేయాలనే తపన తనను ఐపీఎస్ వైపు నడిపించాయని ఆమె చెప్పుకొచ్చారు.