రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 18 , 2026 | 02:37 AM
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో .....
ఏసీ కోచ్‌లో మంటలు.. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో ఘటన
రత్లాం/కోటా, మే 17: మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగిన ఘటనలో రెండు కోచ్‌లు దెబ్బతినగా, బిజీగా ఉండే ముంబై-ఢిల్లీ మార్గంలో దాదాపు 7గంటల పాటు రైల్వే ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు 13 రైలు సర్వీసులపై ప్రభావం పడింది. కోచ్‌లో మంటలు చెలరేగిన విషయాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి.. తక్షణం సహాయక చర్యలు చేపట్టడంతో, అదృష్టవశాత్తూ ఆ బోగీలోని ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. 15 నిమిషాల్లో ప్రభావిత బోగీలోని ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ఓవర్ హెడ్ లైన్ ఎలక్ట్రికల్ లైన్‌కు విద్యుత్తు సరఫరాను నిలిపివేసి.. అగ్నిమాపక దళం సహాయంతో మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగిన కోచ్‌లను రైలు నుంచి వేరు చేసిన తర్వాత, సుమారు 9.45 గంటల సమయంలో రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. అగ్నిప్రమాదానికి కారణంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.