Share News

40 విల్లాలు రూ.6 కోట్లకే?

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:46 AM

కొన్ని కోట్లు విలువ చేసే విల్లాను కొన్ని లక్షలకే కొనుగోలు చేశారు. ఒకటి, రెండు కాదు, ఏకంగా 40 విల్లాలను కేవలం రూ.6 కోట్లకే సమకూర్చుకున్నారు. ఆ ఆస్తులు ఎవరి ద్వారా పొందారో, తిరిగి వారికే వాటిని లీజుకు ఇచ్చి వార్షిక అద్దెలను భారీగా వెనకేసుకున్నారు.

40 విల్లాలు రూ.6 కోట్లకే?

  • స్వల్ప రేటుకు కాటేజీలు, ఇతర నిర్మాణాలూ..

  • సివిల్‌ సర్వీస్‌ దంపతుల భారీ అవినీతి బాగోతం

  • విధులనుంచి తొలగింపు.. రాజస్థాన్‌లో ఘటన

జైపూర్‌, నవంబరు 1: కొన్ని కోట్లు విలువ చేసే విల్లాను కొన్ని లక్షలకే కొనుగోలు చేశారు. ఒకటి, రెండు కాదు, ఏకంగా 40 విల్లాలను కేవలం రూ.6 కోట్లకే సమకూర్చుకున్నారు. ఆ ఆస్తులు ఎవరి ద్వారా పొందారో, తిరిగి వారికే వాటిని లీజుకు ఇచ్చి వార్షిక అద్దెలను భారీగా వెనకేసుకున్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర కలకలం రేపుతున్న క్విడ్‌ ప్రొకో అవినీతి బాగోతమిది. ఈ వ్యవహారంలో అఖిల భారత సర్వీసులో ఉన్న ఇద్దరు అవినీతి తిమింగలాలపై వేటుపడింది. ఆస్తుల బదిలీలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఆ ఇద్దరినీ విధుల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ తిమింగలాలు ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న భార్యాభర్తలు కావడం గమనార్హం. అవినీతి ఆరోపణలపై అడిషనల్‌ డీజీపీ ప్రశాఖ మాథూర్‌ను ఆ కీలక బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఆమెను ఆదివారం ఏపీవోకు (అవెయిటింగ్‌ పోస్టింగ్‌ ఆర్డర్‌) పంపించింది. మాథూర్‌ భర్త, సీనియర్‌ ఐఏఎస్‌ శిఖర్‌ అగర్వాల్‌పై కూడా ప్రభుత్వం ఇదే తరహాలో అక్టోబరు 28న వేటు వేసింది. మాథూర్‌ పేరు మీద ఉదయ్‌పూర్‌, ఆల్వార్‌లో 40 విల్లాలు, కాటేజీలు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. ఆమె భర్త అగర్వాల్‌ ప్రభుత్వంలో అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పరిశ్రమల వ్యవహారాలు)గా కీలక బాధ్యతల్లో ఉన్నారు.


గోయల్‌ ఫ్యాషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే ప్రైవేటు కంపెనీకి మేలు చేయడం ద్వారా అగర్వాల్‌ భారీగా లాభపడినట్టు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. సదరు కంపెనీ తగిన అనుమతులు, ప్లానింగ్‌ లేకుండా నిర్మించే రిసార్టులకు, హోటళ్లకు అగర్వాల్‌ అనుమతులు ఇచ్చారు. దీనికి ప్రతిగా పెద్దఎత్తున స్థిరాస్తులను మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువ రేటుకు దక్కించుకున్నారు. తిరిగి కంపెనీయే ఆ ఆస్తులను లీజులకు తీసుకుని, వాటిపై అగర్వాల్‌ దంపతులకు 1.80కోట్లు చెల్లించేలా ఒప్పందాలు కూడా చేసుకున్నట్టు పేర్కొంది. ఉదయ్‌పూర్‌లోని కాటేజీల నుంచి 80లక్షలు, ఆల్వార్‌లోని విల్లాల ద్వారా కోటి చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. దీంతో ఆస్తుల బదిలీలో అవకతవకలు జరిగినట్టు ఏసీబీ నిర్ధారించింది.

Updated Date - Nov 02 , 2026 | 02:47 AM