Share News

కౌంటర్లలో టికెట్లు కొనే ప్రయాణికులకూ బీమా కవరేజీ తప్పనిసరి

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:01 AM

ఆన్‌లైన్‌లో టికెట్లు కొనే ప్రయాణికులకే కాకుండా కౌంటర్లలో టికెట్లు కొనే వారికి కూడా కచ్చితంగా అదనపు బీమా కవరేజీని వర్తింపజేయాలని రైల్వేను సుప్రీం కోర్టు ఆదేశించింది.

కౌంటర్లలో టికెట్లు కొనే ప్రయాణికులకూ బీమా కవరేజీ తప్పనిసరి

  • రైల్వేకు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 15: ఆన్‌లైన్‌లో టికెట్లు కొనే ప్రయాణికులకే కాకుండా కౌంటర్లలో టికెట్లు కొనే వారికి కూడా కచ్చితంగా అదనపు బీమా కవరేజీని వర్తింపజేయాలని రైల్వేను సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనిని ఈనెల 27 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని నిర్దేశించింది. తమ ఆదేశాలు పాటించకపోతే రైల్వే బోర్డు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. రైల్వే భద్రత, ప్రయాణాల్లో అవాంఛనీయ ఘటనల నివారణకు సంబంధించిన వ్యవహారంలో విచారణ సందర్భంగా జస్టిస్‌ అహసానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆ ఆదేశాలు జారీ చేసింది. అదనపు బీమా కవరేజీపై గతంలో పలుమార్లు ఆదేశాలిచ్చి, తగిన సమయం ఇచ్చినా కూడా రైల్వే చర్యలు తీసుకోకపోవడాన్ని అమికస్‌ క్యూరీ, సీనియర్‌ న్యాయవాది శికిల్‌ సూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టికెట్లు కొనే వారి మధ్య వైరుధ్యం ఎందుకు చూపుతున్నారో వివరణ ఇవ్వాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీని ఈ సందర్భంగా కోర్టు కోరింది.

ఫెన్సింగ్‌ లక్ష్యాలు ఎందుకు పూర్తి చేయడంలేదు

ప్రయాణికుల విషయంలో రైల్వేలోని భద్రతా ప్రమాణాలపై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈవిషయంలో గతంలో తమకు ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలేదని పేర్కొంది. ట్రాక్‌లకు ఫెన్సింగ్‌ ఏర్పాటులో లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతున్నారో, లక్ష్యంలో ఏటా మూడో వంతు ఎందుకు వెనకబడుతున్నారో వివరించాలని బోర్డును సుప్రీం కోర్టు ఆదేశించింది.

Updated Date - Oct 16 , 2026 | 06:02 AM