పొంచి ఉన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం
ABN , Publish Date - May 20 , 2026 | 02:33 AM
తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంచెత్తనున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అలాంటి సంక్షోభాన్ని గతంలో ఎరుగం..
గతంలో ఎరుగం..ఆపడమూ సాధ్యం కాదు
పెట్రోల్ ధరలపై ముందే హెచ్చరించా: రాహుల్
రాయ్‌బరేలీ, మే 19 : తీవ్ర ఆర్థిక సంక్షోభం ముంచెత్తనున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అలాంటి సంక్షోభాన్ని గతంలో ఎరుగం.. ఆపడమూ సాధ్యం కాదని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా కష్టకాలాన్ని చవి చూడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ముందే ఊహించి మిత వ్యయం గురించి తాము చేస్తూ వచ్చిన సూచనలను ప్రధాని మోదీ పెడచెవిన పెట్టారని విమర్శించారు. యూపీలోని రాయ్‌బరేలీలో మంగళవారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. పెట్రోల్,డీజిల్ ధరల పెంపు, మోదీ నాలుగు దేశాల పర్యటన తదితర అంశాలపై ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ఆర్థిక సంక్షోభం తలెత్తితే అదానీ, అంబానీలకు ఏమీ కాదని; రైతులు, కూలీలు, యువకులతోపాటు ఉపాధిని కల్పిస్తున్న చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమలు మాత్రమే దెబ్బతింటాయన్నారు. పొదుపు చర్యలపై తన మాటలను మోదీయే పాటించరని ఆక్షేపించారు. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలమూ ద్రవ్యోల్బణం అంతకంత పెరుగుతూనే ఉంటుందన్నారు. ‘‘పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు కొరత నేపథ్యంలో దేశ ప్రజలను మోదీ పొదుపు పాటించాలని కోరారు. బంగారం కొనొద్దు. విదేశీ పర్యటనలను మానుకోండి అంటూ సూచించారు. ఈ వెంటనే విదేశాలకు బయలుదేరి వెళ్లారు.’’ అని రాహుల్ విమర్శించారు. పెట్రో ధరలు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం నింగిని అంటనున్నదని ముందే తాను హెచ్చరించానని, ఈ సంక్షోభం బారిన పడకుండా కూలీలను, చిన్న వ్యాపారులను రక్షించాలని పదేపదే మోదీని కోరినా, పట్టించుకోలేదన్నారు.