వియత్నాంకు రాహుల్!
ABN , Publish Date - Oct 20 , 2026 | 06:08 AM
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)కు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా..
‘సర్’ ఆందోళనలు జరుగుతుండగా వెళ్లడంపై బీజేపీ ఎద్దేవా
పని కంటే విహారమే ఆయనకిష్టం
వచ్చాక ‘ఓట్ల చోరీ’ కేకలు: కమలం పార్టీ
న్యూఢిల్లీ, అక్టోబరు 19: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)కు, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఆయన పార్టీ దేశవ్యాప్తంగా ఉధృత స్థాయిలో ఆందోళనలు చేస్తుంటే.. ఆయన మాత్రం విదేశాలకు విహార యాత్రకు వెళ్లారంటూ బీజేపీ ఎద్దేవాచేసింది. ఆదివారం గోవాలో సర్‌కు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఆయన వియత్నాం రాజధాని హనోయ్‌కు బయల్దేరి వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అక్కడకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్లారా.. ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారా అనే విషయమై కాంగ్రెస్ ఎలాంటి అధికార ప్రకటనా విడుదల చేయలేదు. ఈ ఏడాది జనవరిలో కూడా ఆయన వియత్నాం వెళ్లివచ్చారు. వాస్తవానికి ఆయన విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశమే. అక్కడ ఆయన ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. విదేశీ గడ్డపై దేశ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని బీజేపీ విమర్శిస్తుంటుంది. తాజా పర్యటననూ తప్పుబట్టింది. ‘పనిచేయడం కంటే విహారాలపైనే ఆయనకు మక్కువ ఎక్కువ. అక్కడ సెలవులు బాగా ఎంజాయ్ చేసి వస్తారు. వచ్చాక ఓట్ల చోరీ అని కేకలు వేస్తుంటారు’ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోమవారం ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. ఈ నవరాత్రి సమయంలో ఆయన విదేశాలకు విహారానికి వెళ్లారా.. లేక కుట్రదారులతో భేటీకి వెళ్లారా అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.