అదానీ రక్షణకే నార్వేకు మోదీ..
ABN , Publish Date - May 20 , 2026 | 02:39 AM
అదానీ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ప్రధాని మోదీ నార్వే పర్యటన చేపట్టారని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలను వారి మానాన వారిని...
రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ, మే 19: అదానీ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా ప్రధాని మోదీ నార్వే పర్యటన చేపట్టారని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలను వారి మానాన వారిని వదిలేసి, అదానీ కోసం ఈ పర్యటన చేశారన్నారు. నార్వే పాలకులను కలిసి ఆయన ‘అదానీకి సాయం చేయండి..అంబానీకి చేయూతను ఇవ్వండి’ అని అభ్యర్థించారని ఆరోపించారు. ‘‘నార్వేకు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టింది. అక్కడ చిక్కుల్లో పడ్డ అదానీని రక్షించడం కోసం మోదీ రంగంలోకి దిగారు. దీనికోసం 43 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రలో నార్వేను సందర్శించిన తొలి ప్రధాని హోదాలో మోదీ చారిత్రక పర్యటన జరిపారు. బ్లాక్ లిస్టు నుంచి అదానీ సంస్థను తప్పించాలని ఈ సందర్భంగా నార్వేను అభ్యర్థించారు’’ అని రాహుల్ ‘ఎక్స్’ ఖాతాలో విమర్శించారు. ‘మరి మీ వ్యక్తిగత అభ్యర్థనను నార్వే ప్రభుత్వం మన్నించిందా మోదీజీ’ అని ప్రశ్నించారు. తన ఖాతాకు పత్రికల్లో వచ్చిన వార్తల ఫొటోను జతచేశారు. ఈ వార్తా కథనాలను అనుసరించి, నార్వేకు చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ అనేది ప్రభుత్వ బీమా నిఽధి సంస్థ. మిగులు చమురు, గ్యాస్ రెవెన్యూలను నార్వే భావితరాల కోసం పరిరక్షించడం లక్ష్యంగా ఈ సంస్థ 1990ల నుంచి పనిచేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా 1.2 ట్రిలియన్ డాలర్ల నిధిని ఈ సంస్థ కలిగి ఉంది. ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో చమురు వ్యాపారం చేసే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)ను ఆ సంస్థ తన పోర్టుఫోలియా నుంచి గత ఫిబ్రవరి 27న తొలగించింది. అంటే ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. నార్వే సెంట్రల్ బ్యాంక్ అయిన నాగ్రేస్ బ్యాంక్‌తో లావాదేవీల విషయంలో అదానీ గ్రీన్‌పై పలు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.