Share News

మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు

ABN , Publish Date - May 16 , 2026 | 04:08 AM

నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. 87 పరీక్షలు రద్దయ్యాయని, ఫలితంగా..

మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలు

  • 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది భవిష్యత్తు అంధకారం: రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ, మే 15 (ఆంధ్రజ్యోతి): నరేంద్ర మోదీ పాలనలో దేశంలో 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. 87 పరీక్షలు రద్దయ్యాయని, ఫలితంగా.. 9 కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు. ‘ఇక నేను పోటీ పరీక్షలు రాయను.. లఖింపూర్‌ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్‌ మిశ్రా చివరి మాటలివీ.. మూడోసారి నీట్‌ పరీక్షకు హాజరైన హృతిక్‌, పరీక్ష రద్దవ్వడంతో కుప్పకూలిపోయాడు. గోవాలోనూ ఓ నీట్‌ అభ్యర్థి తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్షల్లో ఓడిపోలేదు. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. వారివి ఆత్మహత్యలు కావు.. వ్యవస్థ చేసిన హత్యలు.. 2015-2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగితే, అందులో కేవలం ఒక్కదానిలోనే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులను, ఈడీ 11 కేసులను ఇంకా విచారిస్తూనే ఉన్నాయి. నీట్‌, ఏఐపీఎంటీ సహా ఇతర వైద్య పరీక్షల్లోనే 15 కుంభకోణాలు జరిగాయి. అన్నింటి కంటే సిగ్గుచేటైన విషయమేంటంటే.. ఈ కుంభకోణాల్లో బాధ్యులైన ఒక్క అధికారి కానీ, మంత్రి కానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి ఆ తర్వాత రహస్యంగా మళ్లీ ఉన్నత పదవుల్లోకి తీసుకుంటారు. పరీక్షలు రాసే పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోతారు. మోదీజీ.. మీ జవాబుదారీతనాన్ని నిద్రలేపడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు బలి కావాలి? నా యువ మిత్రులారా.. మీ బాధే నా బాధ. మీ భవిష్యత్తును దొంగిలించే వారు సమాధానం చెప్పాల్సిందే.. ఎంత కాలమైనా సరే బాధ్యులెవరినీ వదిలిపెట్టేది లేదు. ఇది నా వాగ్దానం’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2026 | 04:08 AM