ప్రియాంక నాపై అలిగింది
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:04 AM
అధికార పక్షంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడే విపక్ష నేత రాహుల్ గాంధీ.. తన చెల్లెలు ప్రియాంక తనపై అలిగిందంటూ గురువారం ....
రోజంతా నాతో మాట్లాడలేదు.. విమానంలోనూ అంతే!
కానీ వయనాడ్‌లో దిగగానే మాట్లాడడం మొదలెట్టింది
అదే ఈ నేల మహిమ.. రాహుల్ సరదా వ్యాఖ్యలు
వయనాడ్, ఫిబ్రవరి 26: అధికార పక్షంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడే విపక్ష నేత రాహుల్ గాంధీ.. తన చెల్లెలు ప్రియాంక తనపై అలిగిందంటూ గురువారం కాసేపు సరదాగా మాట్లాడారు! ఒక రోజంతా తనతో మాట్లాడని ఆమె.. వయనాడ్‌లో అడుగుపెట్టగానే తనతో మాట్లాడడం మొదలుపెట్టారని.. అదే వయనాడ్ మహిమ అని మెచ్చుకున్నారు!! 2024లో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో సర్వస్వం కోల్పోయినవారి కోసం కాంగ్రెస్ చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన రాహుల్.. ఈ సరదా విషయం గురించి చెప్పారు. ‘‘సాధారణంగా అన్నాచెల్లెళ్లు చిన్న చిన్న విషయాలకు కూడా ఎలా గొడవ పడుతుంటారో మీకందరికీ తెలుసు. నిన్న నేను అలాగే ఏదో ఒక సిల్లీ విషయం చెప్పడంతో నా చెల్లికి కోపం వచ్చింది. దీంతో ఆమె నిన్నంతా నాతో మాట్లాడలేదు. తర్వాత మా అమ్మను కలిసినప్పుడు, చెల్లెలు ఎలా ఉంది? అని అడిగారు. ఆమె కోపంగా ఉందని, నాతో మాట్లాడటం లేదని.. కానీ, తనను బుట్టలో వేశానని చెప్పాను. తను వయనాడ్ వస్తోందని.. ఇక నాతో ఎంతమాత్రం కోపంగా ఉండలేదని కూడా చెప్పాను. విమానంలో ‘హలో’ అని పలకరించాను. అప్పుడు కూడా ప్రియాంక కోపంగానే కనిపించింది. కానీ, వయనాడ్‌లో ల్యాండవగానే నాతో నవ్వుతూ మాట్లాడటం ప్రారంభించింది.’’ అని రాహుల్ వివరించారు. ‘‘అర్థంచేసుకోండి.. అదే వయనాడ్ మ్యాజిక్’’ అని వ్యాఖ్యానించారు.