Share News

రాహుల్‌ చైనా వ్యాఖ్యలపై రచ్చ

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:36 AM

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది....

రాహుల్‌  చైనా వ్యాఖ్యలపై రచ్చ

  • రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో లోక్‌సభలో తీవ్ర గందరగోళం

  • ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె పుస్తకంలోని అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష నేత

  • రాజ్‌నాథ్‌, అమిత్‌షా తీవ్ర అభ్యంతరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. 2020లో భారత్‌-చైనా సంక్షోభానికి సంబంధించి భారత ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె రాసిన పుస్తకంలోని అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రస్తావించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోం మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్‌ రిజిజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికార, విపక్షాల నడుమ వాగ్యుద్ధం, గందరగోళం నడుమ సభ మంగళవారానికి వాయిదాపడింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ దేశభక్తిని ప్రశ్నిస్తూ తీవ్రంగా విమర్శించారు. తర్వాత మాట్లాడిన రాహుల్‌... తొలుత ఆయన విమర్శలకు స్పందిస్తానంటూ భారత్‌-చైనా సంక్షోభంపై జనరల్‌ నరవణె తన పుస్తకంలో పేర్కొన్న స్మృతులను ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. మంత్రి రాజ్‌నాథ్‌ అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురితమైందో లేదో రాహుల్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే చైనా ట్యాంకులు అన్న పదాన్ని విపక్ష నేత పదే పదే లేవనెత్తాలని చూడడంతో సభలోని ప్రతి బీజేపీ నేతా తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. ఆ పుస్తకం అధికారికం కాదని.. ఇంతవరకు ప్రచురణకే నోచుకోలేదని.. దానిలోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారని రాజ్‌నాథ్‌ నిలదీశారు. సైనిక దళాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆ సమయంలో సభలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను ఆయన ఎలా ప్రస్తావిస్తారని అమిత్‌షా నిలదీశారు. తన మాటలకు వారు భయపడకపోతే ఎందుకు మాట్లాడనివ్వడం లేదని రాహుల్‌ ప్రశ్నించారు. తాను చదివేది నూరు శాతం అధికారికమన్నారు. సభ కార్యకలాపాలతో సంబంధం లేని పుస్తకం లేదా దినపత్రిక క్లిప్పింగ్‌లలోని అంశాలను ప్రస్తావించడానికి వీల్లేదని స్పీకర్‌ ఓం బిర్లా రూ లింగ్‌ ఇచ్చారు. అయితే తాను చదువుతున్నది అధికారికమైనదేనని, దాని నుంచి కోట్‌ చేస్తానని రాహు ల్‌ స్పష్టంచేశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించలేదని.. అందుచేత దానిని ప్రస్తావించడానికి వీల్లేదని రాజ్‌నాథ్‌ పునరుద్ఘాటించారు.


జనరల్‌ నరవణె రాసిన పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రభుత్వం అనుమతించడం లేదని రాహుల్‌ ఆరోపించారు. తన వైఖరిని తెలియజేసేందుకు వేరే మ్యాగజైన్‌ వ్యాసంలోని అంశాలను ప్రస్తావిస్తున్నానని చెప్పారు. దీనిని కూడా స్పీకర్‌ అనుమతించలేదు. రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వం గనుక ఆ పుస్తకం ప్రచురణను అంగీకరించనట్లయితే జనరల్‌ నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభాపతి రూలింగ్‌ ఇచ్చిన తర్వాత కూడా విపక్ష నేత దానిని ఉల్లంఘిస్తున్నారని మంత్రి రిజిజు ఆక్షేపించారు. ఆర్మీ మాజీ చీఫ్‌ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించొద్దని ఓం బిర్లా పలు సార్లు హెచ్చరించినా రాహుల్‌ వినిపించుకోలేదు. రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడడం ఆయనకు ఇష్టం లేకపోతే తదుపరి వక్తగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు అవకాశమిస్తానని సభాపతి స్పష్టంచేశారు. అఖిలేశ్‌, టీఎంసీ నేత కల్యాణ్‌ బెనర్జీ తదితరులు రాహుల్‌కు మద్దతిచ్చారు. అటు విపక్షం, ఇటు అధికార పక్ష సభ్యులు పరస్పరం నినాదాలకు దిగడంతో స్పీకర్‌ తొలుత మధ్యాహ్నం 3 గంటల వరకు ఒకసారి.. 4గంటల వరకు రెండోసారి సభను వాయుదావేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేదు. చివరకు సభ మంగళవారానికి వాయిదాపడింది.

స్పీకర్‌ ముందస్తు అనుమతితోనే..:

పుస్తకాలు, మ్యాగజైన్లు, పత్రికల్లోని అంశాలను ప్రస్తావించడంపై పార్లమెంటు నిబంధనల్లో నిషేధం లేదని పార్లమెంటరీ నిపుణులు స్పష్టం చేశారు. అయితే ప్రచురితమైన వాటిలోని అంశాలను స్పీక ర్‌ అనుమతితో ప్రస్తావించవచ్చని.. అయితే ఆయనకు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్‌ వీకే అగ్నిహోత్రి తెలిపారు. ‘లోక్‌సభలోని 349(1) నిబంధన ఏం చెబుతోందంటే.. సభ సమావేశమైనప్పుడు.. సభ కార్యకలాపాలతో సంబంధం ఉంటే తప్ప ఏ పుస్తకం, దినపత్రిక, లేఖను కూడా చదవరాదు. స్పీకర్‌ అనుమతించినా.. తాను చదివే సమాచారం ధ్రువీకరణ గు రించి ఆ సభ్యుడిని ప్రశ్నించవచ్చు. ప్రచురించని పుస్తకంలోని అంశాలను ప్రస్తావించాలని రాహుల్‌ ప్రయత్నించారు’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నన్ను మాట్లాడనివ్వడం లేదు: రాహుల్‌

జనరల్‌ నరవణె పుస్తకంలోని అంశాలను సభలో తనను లేవనెత్తనివ్వడం లేదని, తనను మాట్లాడనివ్వడంలేదని రాహుల్‌ ఆరోపించారు. చైనాతో సంక్షోభానికి సంబంధించి ప్రధాని మోదీని, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ను జనరల్‌ అందులో తప్పుబట్టారని పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులకు తెలిపారు. ఆయన అభిప్రాయాలు ఓ వ్యాసంలో వచ్చాయని.. వాటినే తాను ప్రస్తావించానని చెప్పారు. అది బయటకు వస్తే వారిద్దరి బండారం బయటపడుతుందని.. అందుకే తాను ప్రస్తావించిన వాక్యాలు అధికార పక్షాన్ని భయపెడుతున్నాయన్నారు. జనరల్‌ నరవణె రాసిన పుస్తకం ప్రచురణకు నోచుకోకుండా మగ్గిపోతోందన్నారు. రాహుల్‌ను ఆయన సోదరి, ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా గట్టిగా సమర్థించారు. ఆయన మన సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీయడం లేదని.. ఆర్మీ చీఫ్‌ పుస్తకం నుంచే ప్రస్తావిస్తున్నారని.. తాము దాచదలచుకున్న అంశాలు బయటకు వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలు ఇలాగే చేస్తుంటారని ధ్వజమెత్తారు.

Updated Date - Feb 03 , 2026 | 02:37 AM