రైతులకు మోదీ వంచన
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:15 AM
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మన రైతులను వంచించారని, దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు.
వాణిజ్య ఒప్పందంతో దేశాన్ని అమ్మేశారు: రాహుల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆయన మన రైతులను వంచించారని, దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు. ఇది అన్నదాతల భవిష్యత్‌కు సంబంధించిన అంశమన్నారు. భారత వ్యవసాయ పరిశ్రమపై పరాయిదేశం పెత్తనం దీర్ఘకాలం కొనసాగేందుకు అనుమతిస్తున్నారా అని ఆదివారం ‘ఎక్స్’లో నిలదీశారు. ప్రధానిపై ఈ సందర్భంగా ఐదు ప్రశ్నలు సంధించారు. ఇది ఇవాళ్టి వ్యవహారం కాదని.. భవిష్యత్‌కు కూడా సంబంధించిందని స్పష్టంచేశారు. పత్తి రైతులు, ఎగుమతిదారుల ప్రయోజనాల పరిరక్షణలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన శనివారం కూడా ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్‌తో వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఆ దేశ జౌళి ఉత్పత్తులపై సుంకం మినహాయించిందని.. దీనివల్ల భారత జౌళి పరిశ్రమ సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఇదిలా ఉండగా, యూపీఏ హయాంలో మంత్రి కపిల్ సిబల్.. 2010లో ఎప్‌స్టిన్ నిధులతో నడుస్తున్న సంస్థ నుంచి అవార్డు తీసుకున్నారని బీజేపీ తెలిపింది. దీనిపై రాహుల్‌గాంధీ పార్లమెంటులో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది.
రాహుల్ అడిగిన 5 ప్రశ్నలు
అమెరికా జన్యుమార్పిడి (జీఎం) పంట అయిన మొక్కజొన్న పొడిని దిగుమతి చేసుకోవడంలో అర్థమేమిటి? భారతీయ పశుసంపదతో ఈ జన్యు పొడిని తినిపిస్తారా? దీనివల్ల మన పాల ఉత్పత్తులు ఇక అమెరికాపై ఆధారపడాల్సిందేనా?
జీఎం సోయా నూనెను దిగుమతి చేసుకుంటే.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర , రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా సోయా రైతులపై ప్రతికూల ప్రభావం పడదా?
అదనపు ఉత్పత్తుల దిగుమతి అంటే అందులో ఏమున్నాయి? పప్పులు.. ఇతర పంటలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలన్న ఒత్తిడికి ఇది సూచిక కాదా?
వాణిజ్యేతర అడ్డంకులు తొలగించాలంటే అర్థమేంటి? జన్యుమార్పిడి పంటలపై తన దృఢవైఖరిని భారత్ సడలించుకోవాలని.. పంటల సేకరణ, మద్దతు ధరలు, బోన్‌సలను కుదించాలని అమెరికా భవిష్యత్‌లో ఒత్తిడి తెస్తుందా?
ఒక్కసారి అమెరికా వ్యవసాయ దిగుమతులకు మన మార్కెట్ ద్వారాలు తెరిచామంటే ఏటికేడాదీ మరింత విస్తృతం చేయాల్సి ఉంటుంది. దీనిని అడ్డుకుంటారా.. లేక క్రమంగా మరిన్ని పంటలను దిగుమతి చేసుకుందామంటారా?