Rahul Gandhi: ఇండోర్‌లో నీళ్లు కాదు.. విషాన్ని పంచారు: రాహుల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:42 AM
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటి మరణాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు...
న్యూఢిల్లీ, ఇండోర్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలుషిత నీటి మరణాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం, ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇండోర్ ప్రజలకు పంపిణీ చేసింది నీళ్లు కాదని, అది ముమ్మాటికీ ‘విషమే’ అని ఆయన ఆరోపించారు. ఇండోర్‌లో అతిసారం(డయేరియా) వ్యాపించి 5నెలల పసికందు సహా పది మంది ప్రాణాలు కోల్పోవడంపై రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘తాగునీటి పైపులైన్లలోకి మురుగునీరు ఎలా చేరింది? సమయానికి నీటి సరఫరాను ఎందుకు నిలిపివేయలేదు? ఈ మరణాలకు బాధ్యులైన వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.