పేదలు ఆకలితో చావాలా?
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:20 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌జీఈఏ) రద్దు చేయడం ద్వారా పేదలు ఆకలితో చనిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శించారు.
గ్రామీణులకు కనీస వేతనం ఇవ్వడం మోదీకి ఇష్టం లేదు
ఉపాధి చట్టం రద్దుపై రాహుల్ ధ్వజం
రాయ్‌బరేలీ, జనవరి 20: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్‌ఆర్‌జీఈఏ) రద్దు చేయడం ద్వారా పేదలు ఆకలితో చనిపోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. పేదల కంటే బ్యూరోక్రాట్లకే ఆయన ప్రాధాన్యమిస్తున్నారని ధ్వజమెత్తారు. యూపీలో తన సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన యూత్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న రాయ్‌బరేలీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో తీసుకొచ్చిన జీ-రామ్-జీ చట్టానికి గాంధీజీ పేరు తొలగించడాన్ని తప్పుబట్టారు. ‘ఆర్థిక జవాబుదారీతనంతో నిరుద్యోగ గ్రామీణులకు కనీస వేతనం అందించడం ఉపాధి చట్టం ఉద్దేశం. కానీ ఇది మోదీకి ఇష్టం లేదు. అధికారాన్ని కేంద్రీకరించి.. బ్యూరోక్రాట్లకు అప్పగించి.. పేదలు ఆకలితో చావాలని ఆయన కోరుకుంటున్నారు’ అని దుయ్యబట్టారు.