Share News

నిరసనలన్నీ.. ఏకీకృతం! ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాహుల్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:29 AM

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ‘సత్యాగ్రహ’ పేరుతో శనివారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

నిరసనలన్నీ.. ఏకీకృతం! ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాహుల్‌

  • ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన రాహుల్‌

  • సమస్య ఏదైనా, ఎలాంటిదైనా పంచుకోవాలని ప్రజలకు సూచన

న్యూఢిల్లీ, అక్టోబరు 3: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకుడు, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ‘సత్యాగ్రహ’ పేరుతో శనివారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాలపై జరుగుతున్న నిరసనలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించడం విశేషం. సత్యం కోసం శాంతియుత ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్న మహాత్మాగాంధీ 157వ జయంతి ముగిసిన రెండు రోజుల తర్వాత ‘సత్యాగ్రహ’ వెబ్‌సైట్‌ను ఆయన ఆవిష్కరించారు. ‘‘నిరసనకారులు ఏయే కారణాలతో నిరసన చేపట్టారో వివరాలు దీనిలో పంచుకోవచ్చు. ఇంటరాక్టివ్‌ మ్యాప్‌ ద్వారా దేశంలో ఒకే తరహా ఉద్యమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి నేరుగా మేం మద్దతు ప్రకటిస్తాం.’’ అని రాహుల్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం సామూహికంగా కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉద్యమిస్తున్నారు. జెన్‌జీ, విద్యార్థులు, రైతులు, గిరిజనులు, దళితులు, మహిళలు.. ఇలా ప్రతి వర్గానికి వారి సొంత కారణం, కథనం ఉంటుంది. అయితే.. ఇలా ఒక్కొక్కరు గళం వినిపిస్తే కొన్ని సందర్భాల్లో అవి అణిచివేతకు గురవుతాయి. అందుకే.. ‘సత్యాగ్రహ’ను ఆవిష్కరించారు. ఇది అందరి నిరసనలను ఏకీకృతం చేస్తుంది. బాపు మనకు ఇదే బోధించారు. సత్యమే బలమైన ఆయుధం. ఎలాంటి అన్యాయంపై మీరు పోరాడుతున్నా.. మీ కథనాన్ని పోస్టు చేయండి’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.


మీకోసం నేను..

‘‘మీ కోసం నేను ఏం చేయాలని ఆకాంక్షిస్తే అది చేస్తా. మీలాగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిని ‘సత్యాగ్రహ’ వేదికగా మీరు స్వయంగా కలుసుకోవచ్చు. మీకోసం పార్లమెంటు లోపల, బయట.. వీధుల్లోను, లేఖలు రాయడం ద్వారా, మీతో కలిసి నడవడంలోనూ.. మీరు ఏం కోరుకుంటే అలా చేసేందుకు ఒక విపక్ష నేతగా ముందుంటా. ఇది నా బాధ్యత.’’ అని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో తమ పేరును, లేదా బృందం పేరును పేర్కొంటూ వివరాలు జోడిస్తే చాలన్నారు. ‘‘సత్యం.. నలిగిపోతోంది. అణిచివేతకు గురవుతోంది. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ‘సత్యాగ్రహ’ డిజిటల్‌ వేదికను తీసుకువచ్చాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 06:54 AM