Share News

లోక్‌సభలో ‘పుస్తక’ పోరు!

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:49 AM

మాజీ సైనికాధిపతి ఎం.ఎం.నరవణే అముద్రిత ఆత్మకథలోని అంశాలు ఇప్పటికే పార్లమెంటును కుదిపేస్తుండగా, ‘బోఫోర్స్‌’పై ప్రచురించిన పుస్తకాలను అధికార పక్షం ప్రదర్శించడం మరింత కలకలం రేపింది.

లోక్‌సభలో ‘పుస్తక’ పోరు!

  • నరవణే ఆత్మకథను సభలో ప్రదర్శించిన రాహుల్‌.. బోఫోర్సుపై పుస్తకాన్ని ప్రస్తావించిన బీజేపీ ఎంపీ

  • సభలో తీవ్ర గందరగోళం

  • స్పీకర్‌కు పరస్పరం ఫిర్యాదులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మాజీ సైనికాధిపతి ఎం.ఎం.నరవణే అముద్రిత ఆత్మకథలోని అంశాలు ఇప్పటికే పార్లమెంటును కుదిపేస్తుండగా, ‘బోఫోర్స్‌’పై ప్రచురించిన పుస్తకాలను అధికార పక్షం ప్రదర్శించడం మరింత కలకలం రేపింది. ఆ పుస్తకాల ఆధారంగా గాంధీల కుటుంబంపై మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబేను అనుమతించడంపై కాంగ్రెస్‌ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాకు తమ నిరసన తెలిపారు. చైనా దురాక్రమణపై నరవణే పుస్తకంలోని భాగాలను ప్రచురించిన ఆర్టికల్‌ను చదువుతానంటూ విపక్ష నేత రాహుల్‌ గాంధీ పట్టుబట్టడంతో గత రెండురోజులుగా సభ స్తంభించిన విషయం తెలిసిందే. బుఽధవారం సమావేశాలు మొదలుకాగానే బీజేపీ ఎంపీ దూబే పలు పుస్తకాలను తనతో సభలోకి తెచ్చారు. వాటి పేర్లు చదువుతూ, బోఫోర్సు కుంభకోణం సహా గాంధీల కుటుంబ వ్యవహారాలపై వాటిలో ఏం రాశారనేది మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో సభలో పెద్దఎత్తున గందరగోళం నెలకొంది. 12 గంటలకు సభ తొలిసారి వాయిదా పడింది. ఈ సమయంలో దీపేందర్‌ సింగ్‌ హూడా సహా పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు సభాపతి కార్యాలయానికి చేరుకుని, దూబేపై ఓం ప్రకాశ్‌ బిర్లాకు ఫిర్యాదు చేశారు. దూబేకు మద్దతుగా కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు, ఇతర బీజేపీ ఎంపీలు కూడా అక్కడకు చేరుకున్నారు. రాహుల్‌ తీరుపై వారూ ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలూ స్పీకర్‌ సమక్షంలోనే కొద్దిసేపు వాగ్యుద్ధం సాగించాయి. మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సభ ప్రారంభం కాగానే, దూబే తిరిగి గాంధీల కుటుంబంపై ప్రస్తావనలు ఉన్న పుస్తకాల్లోని భాగాలను చదవడం ప్రారంభించగా, స్పీకర్‌ ఆయనను వారించారు. సభా వ్యవహారాలతో నేరుగా సంబంధం లేని పుస్తకాలు లేక వార్తాపత్రికలు లేక ఉత్తరాల్లోని భాగాలను చదవడం నిబంధనల ఉల్లంఘన అవుతుందని, స్పీకర్‌ దీనిపై ఇప్పటికే నిర్ణయం ప్రకటించారన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను మాత్రమే అనుమతిస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత సభ సాయంత్రం ఐదు గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సాయంత్రం 5 గంటలకు లోక్‌సభలో జవాబివ్వాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అసలు సభకే రాలేదు. సభ 5 గంటలకు సమావేశం కాగానే అధికార పక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చారు. ఎనిమిది మంది విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, కేంద్రంలోని అగ్ర నాయకత్వం యుద్ధ సమయంలో ప్రతిస్పందించిన తీరు బట్టబయలు అవుతుందనే భయంతోనే రాహుల్‌ను నరవణే పుస్తకంలోని భాగాలను సభలో చదవనీయడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా వాద్రా విమర్శించారు.


ఇదిగో.. ఇదే ఆ పుస్తకం

కాంగ్రెస్‌ ఎంపీలు మాజీ సైనికాధిపతి నరవణేను, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను సూచించే పోస్టర్లు, బ్యానర్లతో సభకు వచ్చారు. నరవణే ఆత్మకథ ‘ఫోర్‌ స్టార్స్‌’ పుస్తకాన్ని రాహుల్‌ సభ లోపలా, బయటా ప్రదర్శించారు. ఆ పుస్తకాన్ని చూపిస్తూ పార్లమెంటు వెలుపల మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ రోజు ప్రధాని మోదీ వస్తారని తాను అనుకోవడం లేదని, ఒకవేళ ఆయన వస్తే ఈ పుస్తకాన్ని ఆయనకు అందిస్తానని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి పుస్తకమేదీ లేదని స్పీకర్‌ నుంచి, ప్రభుత్వం, రక్షణ మంత్రి వరకు సభలో చెబుతున్నారు. కానీ, ఇదిగో పుస్తకం ఉంది. ఈ విషయం దేశ యువత తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నారు. 2020లో చైనా దురాక్రమణ సమయంలో ప్రధాని మోదీ తన కర్తవ్యాన్ని నిర్వర్తించలేదని, అప్పటి ఆర్మీ చీఫ్‌ నరవణేపైనే మొత్తం బాధ్యతను వదిలేశారని విమర్శించారు. చైనా దురాక్రమణ సమయంలో లద్దాక్‌లో ఏం జరిగిందనేది నరవణే వివరంగా రాశారన్నారు. యుద్ధ సమయంలో ‘మీకు ఏది తోస్తే అది చేయండి’ అని తనతో మోదీ అన్న మాటలను ఈ పుస్తకంలో ప్రధానంగా నరవణే ప్రస్తావించారని రాహుల్‌ తెలిపారు.

బిట్టూ ‘ద్రోహి’.. రాహుల్‌ ‘దేశ విరోధి’

రాహుల్‌ గాంధీ ఒకప్పటి తన సహచరుడు, ప్రస్తుత కేంద్రమంత్రి రవనీత్‌సింగ్‌ బిట్టూను ద్రోహిగా అభివర్ణించారు. మంత్రి కూడా తన మాజీ నాయకుడిని దేశానికి శత్రువుగా పేర్కొన్నారు. బుధవారం పార్లమెంటు మకర ద్వారం వద్ద ఈ ఘటన జరిగింది. తమ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ రాహుల్‌, ఆయన పార్టీ ఎంపీలు ద్వారం వద్ద ధర్నా చేస్తుండగా.. బిట్టూ సభ లోపలకు వెళ్లేందుకు వచ్చారు. ధర్నా చేస్తున్న ఎంపీలను చూసి.. ఏదో యుద్ధంలో గెలిచినట్లుగా ఇక్కడ కూర్చున్నారని ఆయన అన్నారు. అక్కడే ఉన్న రాహుల్‌.. ‘ఓ ద్రోహి ఇటుగుండా నడచుకుంటూ వస్తున్నాడు’ అంటూ ఆయన్ను చూసి.. ‘హలో సోదరా.. మిత్ర ద్రోహీ.. ఆందోళన చెందకు.. మళ్లీ కాంగ్రె్‌సలోకి వస్తావు’ అని కరచాలనానికి చేయి ముందుకు చాపారు. షేక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరించిన బిట్టూ.. రాహుల్‌ను దేశ విరోధి అంటూ ముందుకు సాగారు.

Updated Date - Feb 05 , 2026 | 03:49 AM